‘అప్ప ఆరాటమే కానీ బావ బతకడని అందరికీ తెలుసు’ అనే ముతక సామెత ఒకటుంది. ఇపుడీ సామెత తెలంగాణాలో టీడీపీ పరిస్ధితికి సరిగ్గా సరిపోతుంది. ఎందుకంటే ఇక్కడ తెలుగుదేశంపార్టీ పరిస్దితి అలాగే అయిపోయింది. తెలంగాణాలో టీడీపీకి మొదటి దెబ్బ రాష్ట్ర విభజనతోనే పడింది.  టీడీపీ మొదటినుండి సీమాంధ్ర ప్రాంతంలో కన్నా తెలంగాణాలోనే చాలా బలంగా ఉండేది. అంతటి బలమున్న పార్టీకి ప్రత్యేక తెలంగాణాలో దెబ్బ పడిపోయింది.

ఇక రెండో దెబ్బ ఎప్పుడు పడిందంటే ఓటుకునోటు కేసు రూపంలో పడింది. 2014లో అదృష్టంకొద్ది అధికారంలోకి వచ్చిన చంద్రబాబునాయుడు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్రచేశారు. ఆ కుట్ర కాస్త బయటపడటంతో అరెస్టుకు భయపడి ఉమ్మడి రాజధాని హైదరాబాద్ వదిలేసి విజయవాడకు పారిపోయారు. మళ్ళీ అప్పటినుండి అంటే దాదాపు ఎనిమిదన్నర సంవత్సరాలుగా చంద్రబాబు తెలంగాణా రాజకీయాల్లో జోక్యం చేసుకుంటే ఒట్టు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని తెలంగాణాలో ఏదో సాధించాలని ప్రయత్నించి ఫెయిలయ్యారు.

ఇక అప్పటినుండి మళ్ళీ తెలంగాణా రాజకీయాలను వదిలేశారు. ఏదో కాలక్షేపానికి తెలంగాణాలోని తమ్ముళ్ళతో మీటింగులు పెడతుంటారంతే. ఈ నేపధ్యంలో ఖమ్మంలో బుధవారం జరిగిన బహిరంగసభకు హాజరయ్యారు. ఎందుకంటే తెలంగాణాలో పొలిటికల్ స్పేస్ ఉందట, దాన్ని భర్తీ చేసేందుకు శతవిధాల ప్రయత్నాలు చేయాలని చంద్రబాబు అనుకున్నారట. చంద్రబాబు అనుకున్నట్లు తెలంగాణాలో పొలిటికల్ స్పేస్ ఉందాసలు. హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్, మళ్ళీ అధికారంలోకి రావాలని కాంగ్రెస్, ఎలాగైనా అధికారంలోకి వచ్చేయాలని బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తున్నాయి.

మూడుపార్టీలు అధికారం కోసం ప్రయత్నిస్తుంటే ఇంక టీడీపీకి స్పేస్ ఎక్కడుంది ? ఒకవేళ చంద్రబాబు ధైర్యంచేసి అభ్యర్ధులను పెట్టాలన్నా 119 నియోజకవర్గాల్లోను గట్టివాళ్ళు దొరకరన్నది వాస్తవం. మహా అయితే కొన్ని ఓట్లు చీల్చగలదేమో అని అనిపిస్తోంది. ఇంతోటి దానికి తెలంగాణాలో స్పేస్ ఉందని, కొన్నిసీట్లు గెలుచుకోగలమని చంద్రబాబు అండ్ కో అనుకోవటం కేవలం భ్రమ మాత్రమే. సీట్లు గెలుచుకోవటం సంగతి దేవుడెరుగు అసలు పోటీచేసేంత ధైర్యం చంద్రబాబుకు ఉందా అన్నదే అనుమానం.
మరింత సమాచారం తెలుసుకోండి: