పోలీసులపై నేషనల్ సెక్యూరిటి గార్డ్స్ (ఎన్ఎస్జీ) ఉన్నతాధికారులు బాగా సీరియస్ అయ్యారు. తమ రక్షణలో ఉన్న చంద్రబాబునాయుడు దాదాపు 3 గంటలు నడిచి అనపర్తికి చేరుకోవటంపై ఎన్ఎస్జీ ఉన్నతాధికారులు విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. మావోయిస్టుల నుండే కాకుండా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ నుండి చంద్రబాబుకు ముప్పున్న కారణంగానే 24 గంటల ఎన్ఎస్జీ కమేండోల రక్షణను కేంద్రం కల్పించింది. ఈ కమేండోల రక్షణకు తోడుగా లోకల్ పోలీసులుంటారు. చంద్రబాబు ఎక్కడ పర్యటించినా లోకల్ పోలీసులు 200 మంది రక్షణగా ఉండాలి.




అలాంటిది అనపర్తి ఘటనలో చంద్రబాబు రక్షణ బాధ్యతను లోకల్ పోలీసులు పూర్తిగా గాలికొదిలేశారని ఎన్ఎస్జీ ఉన్నతాధికారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. ఆ సమయంలో చంద్రబాబుకు ఏమన్నా హానీ జరిగుంటే అది జాతీయ స్ధాయి వివాదమయ్యుండేదని ఢిల్లీలోని ఎన్ఎస్జీ ఉన్నతాధికారులు ఆందోళన వ్యక్తంచేశారు. తమ రక్షణలోని ఒక వీవీఐపీ రోడ్డుపై 3 గంటలు నడవటానికి లోకల్ పోలీసులు ఎలా అనుమతించారనే విషయంలో సీరియస్ అయ్యారు.




చంద్రబాబుకు జరగరానిది జరిగుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారనే విషయంలో ఎన్ఎస్జీ దర్యాప్తు కూడా మొదలుపెట్టిందట. అనపర్తి ఘటనపై ఏమి జరిగిందనే విషయమై చంద్రబాబుకు రక్షణగా ఉన్న ఎన్ఎస్జీ అధికారుల  నుండి రిపోర్టు అడిగారని సమాచారం. ఇదే విషయమై లోకల్ పోలీసులకు ఎన్ఎస్జీ నోటీసులు కూడా పంపిందని తెలిసింది.




తమ నోటీసుకు వెంటనే జిల్లా ఎస్పీ సమాధానం చెప్పాలని నోటీసులో ఎన్ఎస్జీ ఆదేశించిందట. చంద్రబాబు వెంట జామర్ వెహికల్స్ లేకుండా అంబులెన్స్ లేకుండా చివరకు ఎన్ఎస్జీ భద్రతాధికారులు కూడా ఇబ్బందులు పడేట్లుగా లోకల్ పోలీసులు చాలా నిర్లక్ష్యం వహించినట్లు ఎన్ఎస్జీ ఉన్నతాధికారులు భావిస్తున్నారు. లోకల్ పోలీసుల సహకరించకపోతే తాము బాధ్యతలను ఎలా నిర్వర్తించగలమని ఎన్ఎస్జీ ఉన్నతాధికారులు జిల్లా ఎస్పీని నోటీసులో నిలదీసినట్లు తెలుస్తోంది. మొత్తానికి జిల్లా పోలీసులు చంద్రబాబుతో పాటు మరో వెయ్యిమంది మీద కేసులు నమోదు చేస్తే ఎన్ఎస్జీ ఉన్నతాధికారులేమో జిల్లా పోలీసులకు నోటీసులు ఇవ్వటం సంచలనంగా మారింది.







మరింత సమాచారం తెలుసుకోండి: