వైద్య పరీక్షల్లో ఏమి తేలుతుందో అనే టెన్షన్ వీగిపోయింది. పట్టాభి మీద పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారనేది అబద్ధమని తేలిపోయింది.  టీడీపీ నేత పట్టాభిని పరీక్షించిన వైద్యుల బృందం అతని ఒంటిపై దెబ్బలేమీ లేవని తేల్చేసింది.  ఇంతకీ విషయం ఏమిటంటే సోమవారం గన్నవరం పార్టీ ఆఫీసు దగ్గర జరిగిన గొడవల్లో టీడీపీ వాళ్ళతో పాటు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. సీఐ కనకయ్యతో పాటు మరో ఇద్దరు కానిస్టేబుళ్ళ ఫిర్యాదుల ఆధారంగా పట్టాభితో పాటు మరో 11 మందిపై పోలీసులు కేసులు నమోదుచేశారు.





సోమవారం సాయంత్రం పట్టాభిని అదుపులోకి తీసుకున్న పోలీసులు మంగళవారం మధ్యాహ్నం గన్నవరం కోర్టులో హాజరుపరిచారు. ఈ మధ్యలో తనను చచ్చేట్లు కొట్టారని పట్టాభి ఆరోపించారు. తోట్లవల్లూరు పోలీసుస్టేషన్ కు తీసుకెళ్ళగానే ముసుగులు వేసుకున్న ముగ్గురు వచ్చి కర్రలతో చితకబాదినట్లు పట్టాభి చెప్పారు. అందుకు సాక్ష్యంగా తన చేతులు, కాళ్ళపైన దెబ్బలను మీడియాకు చూపించారు. కోర్టులో విచారణ సందర్భంగా జడ్జీకి కూడా దెబ్బలను చూపించారు.





వెంటనే జడ్జి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు.  కోర్టు ఆదేశాల ప్రకారం బుధవారం తెల్లవారి వైద్యులు పట్టాభికి వైద్యపరీక్షలు చేశారు. పట్టాభి చూపించిన, ఆరోపించిన ప్రకారం చూసినా అరచేతులపైన ఎలాంటి గాయాలు కనబడలేదు.  ఎడమ మోకాలి మీద, ఎడమమోచేయి దగ్గర చిన్న గాయమైతే కనబడుతోంది. పోలీసులు కొట్టడం వల్లే గాయాలయ్యాయా అనేది అనుమానంగా మారింది. అనుమానాలే చివరకు నిజాలయ్యాయి.






ఎందుకంటే పట్టాభి చెప్పిన ప్రకారం ముసుగేసుకున్న ముగ్గురు వ్యక్తులు అర్ధగంట పాటు కర్రలతో చచ్చేట్లు కొట్టారు. నిజంగానే అర్ధగంటపాటు కర్రలతో చచ్చేట్లు కొడితే అంత చిన్న గాయాలే అవుతాయా ? అన్నది అనుమానం. అరిచేతులు, అరికాళ్ళపైన లాఠీలతో బాగా కొట్టారని కూడా చెప్పారు. అయితే కోర్టులోపలికి మామూలుగానే నడిచి వెళ్ళారు. నిజంగానే పట్టాభి చెప్పినట్లుగా అరికాళ్ళపైన అంతగా కొడితే అసలు నడిచే అవకాశమే ఉండదు. ఏదేమైనా ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన వైద్య పరీక్షల్లో పోలీసులు పట్టాభిని కొట్టలేదని తేలిపోయింది.

 




మరింత సమాచారం తెలుసుకోండి: