ఖజానా భర్తీపై ఏపీ సర్కార్ ఫుల్ ఫోకస్ పెట్టింది. షార్ట్‌ టర్మ్‌ ప్లాన్‌లతోపాటు.. లాంగ్‌ టర్మ్‌ ప్లానులను సిద్దం చేసుకుంది.  రాష్ట్రంలో అందుబాటులో ఉన్న వనరులను.. అవకాశాలను బేస్‌ చేసుకుని... పారిశ్రామిక, సేవల రంగంలో వీలైనంత మేర ప్రగతి సాధించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంటోంది. దీనిలో భాగంగా పన్ను ఎగవేత.. ఆర్థిక నేరాల కట్టడికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది సర్కార్‌.

 

కరోనా గడ్డుపరిస్థితుల నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించేందుకు జగన్ సర్కార్ భారీ కసరత్తు చేస్తోంది. ఓవైపు కరోనా నివారణకు చర్యలు తీసుకుంటూనే.. ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. రాష్ట్రానికి ఏవిధంగా ఆదాయాన్ని సమకూర్చాలనే అంశంపై.. ఆయా శాఖలకు చెందిన అధికారులు కసరత్తు చేస్తున్నారు. దీర్ఘ కాలిక ప్రణాళికలతోపాటు.. స్వల్ప కాలిక ప్రణాళికలను సిద్దం చేస్తున్నారు. సామాన్యులకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటూ..  ఖజానా నింపడంపై ఆర్ధిక శాఖ కసరత్తు ముమ్మరం చేసింది.

 

ముందుగా పన్ను ఎగవేత దారులను గుర్తించే పనిలో పడింది సర్కార్‌. ఏడాది కాలంగా కసరత్తు చేసి.. ఆదాయాన్ని పెంచుకుంది ప్రభుత్వం. గడచిన ఏడాదిలో వ్యాపార, వాణిజ్య వర్గాలపై టెక్నాలజీని వినియోగించుకుని నిరంతరం నిఘా పెట్టడంతో... కొంత మేర ఫలితాలు కన్పించాయన్నది ప్రభుత్వ భావన. ఈ నిఘా వల్ల గతేడాది వేయి 465కోట్ల రూపాయల మేర జీఎస్టీ ఆదాయాన్ని కొల్పోకుండా అడ్డుకోగలిగామని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే.. చెక్‌ పోస్టుల కళ్లుగప్పి తిరిగే  సరుకు రవాణ వాహానాలపై ఫోకస్‌ పెట్టనుంది ప్రభుత్వం. వే బిల్స్, లోడ్ మీద నిఘా పెడితే రాష్ట్ర ఖజానాకు చేరే ఆదాయం మరింత మెరుగవుతుందని సర్కార్‌ భావిస్తోంది. చెక్‌ పోస్టుల వద్ద నిరంతరం వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేసింది సర్కార్‌.  ఆకస్మిక తనిఖీలు చేపట్టడం ద్వారా జీఎస్టీ నిబంధనలను ఉల్లంఘించే వారిని గుర్తించవచ్చనేది ప్రభుత్వ వ్యూహం.

 

పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు ...ఈ ఏడాది నుంచి పక్కా స్కెచ్‌ ప్రిపేర్‌ చేసింది సర్కార్‌. కేంద్రంలో డీఆర్‌ఐ తరహాలోనే.. రాష్ట్ర పరిధిలో కూడా డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అనే విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఈ విభాగం ఆర్థిక శాఖకు అనుబంధంగా ఉంటుంది. రాష్ట్రంలో జరిగే వ్యాపార లావాదేవీలు.. పన్నుల వసూళ్లు.. పన్నుల ఎగవేత వంటి అంశాలపై నిత్యం నిఘా పెట్టడమే ఈ విభాగం ప్రధాన విధి. దీని ద్వారా రాష్ట్రానికి పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో కోత పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది.

 

రాష్ట్ర ఖజానాకు ఆదాయాన్ని సముపార్జించేందుకు మరో విభాగాన్ని ఎంచుకుంది ప్రభుత్వం. వృత్తి పన్నుల పరిధిలోకి మరింత మందిని చేర్చే అంశాన్ని సీరియస్ గా పరిశీలిస్తోంది సర్కార్‌. గతేడాది వృత్తి పన్ను ద్వారా రాష్ట్రానికి సుమారు 232 కోట్ల రూపాయల మేర ఆదాయం వచ్చింది. ఈ క్రమంలో వృత్తి పన్ను పరిధిలోకి మరింత మందిని తీసుకురావడం ద్వారా ఈ ఆదాయాన్ని రెండింతలు చేయాలని ఏపీ సర్కార్‌ ప్రణాళికలు సిద్దం చేస్తోన్నట్టు సమాచారం. 

మరింత సమాచారం తెలుసుకోండి: