ప్రజలందరూ నిర్భభంగా ఓటేయాలని టీఆర్‌ఎస్‌ డివిజన్‌ అభ్యర్థి ముఠా పద్మనరేశ్‌ పేర్కొన్నారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గాంధీనగర్‌ డివిజన్‌లో గడిచిన ఐదు సంవత్సరాల కాలంలో కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి పనులు చేశామన్నారు. సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ముషీరాబాద్‌ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ సహాయ సహకారాలతో డివిజన్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశామన్నారు. గతంలో ఇచ్చి హామీలనే కాకుండా ఇవ్వని హామీలను కూడా పూర్తి చేశామని, మరోసారి తమను ఓటు కారు గుర్తుకే వేసి తనను గెలిపించాలని ప్రజలను కోరారు. తనకు సహకరించిన డివిజన్ ప్రజలకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు. డివిజన్ ప్రజల సహాయ సహకారాలు, ఆశీస్సులు ఉంటే, డివిజన్‌ను మరింత అభివృ‌ద్ధి చేస్తానన్నారు. అభివృద్ధి పనుల్లో భాగంగా, డివిజన్‌లో మహిళాభ్యుదయానికి మహిళా భవనం నిర్మాణం, పేదలకు ఆరోగ్య సేవలను మరింత చేరువ చేసేందుకు రెండు బస్తీ దవాఖానాలు నిర్మించామన్నారు. రూ.68 కోట్లతో హుస్సేన్‌సాగర్‌ నాలా రిటేయినింగ్‌ వాల్‌ నిర్మాణం పనులు ప్రారంభించామని, ఇప్పటికే తాత్కాలిక వాల్‌నిర్మించామన్నారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌ అమలులో ఉండడం వల్ల.. పనులు పెండింగ్‌లో పడ్డాయన్నారు. రూ.426 కోట్లతో డివిజన్‌కు మణిహారంగా నిర్మించతలపెట్టిన స్టీల్‌బ్రిడ్జ్‌ నిర్మాణం, చిక్కడపల్లి మున్సిపల్‌ కాంప్లెక్స్‌ ప్రాంతంలో షాపింగ్‌ కాంప్లెక్స్‌ పనులను ఎన్నికల ప్రక్రియ పూర్తవగానే ప్రారంభిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

ముషీరాబాద్ డివిజన్‌లోని ప్రజలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎడ్ల భాగ్యలక్ష్మిహరిబాబుయాదవ్ అన్నారు. మంచి కార్పొరేటర్‌ను ఎన్నుకోవాలని, అప్పుడే ముషీరాబాద్‌ డివిజన్‌లో నెలకొన్న సమస్యలకు పరిష్కారానికి అవకాశం ఉంటుందన్నారు. సోమవారం ముషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలు టీఆర్‌ఎస్‌కు సంపూర్ణ మద్దతు ఇచ్చారని తెలిపారు. ప్రజల ఆశీర్వాదంతో మరోసారి కార్పొరేటర్‌గా విజయం సాధిస్తామని పేర్కొన్నారు. డివిజన్‌లో టీఆర్‌ఎస్‌ బలంగా ఉందని, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలకు ఓటమి తప్పదని ఆమె పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: