ఇంటర్నెట్ డెస్క్: క్రికెట్‌లో ‘ముల్తాన్‌ కా సుల్తాన్’ అనగానే మనకు గుర్తొచ్చే పేరు వీరేంద్ర సెహ్వాగ్. పాక్ గడ్డపై ఆ జట్టుపైనే ఏకంగా తొలి ట్రిపుల్ సెంచరీని నమోదు చేసి ఔరా అనిపించాడు. 2004 మార్చి 28న సెహ్వాగ్ నెలకొల్పిన ఆ రికార్డుకు ఇప్పటికీ భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో ఓ గొప్ప స్థానం ఉంది. సెహ్వాగ్ ఈ ఫీట్ సాధించి సోమవారానికి సరిగ్గా 17 ఏళ్లు. ఈ సందర్భంగా వీరూ అప్పటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. అది తన జీవితంలోనే మరిచిపోలేని రోజని, ఇప్పటికీ ఆ రోజు తలుచుకుంటే ఎంతో ఆనందంగా ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఇండియా - పాకిస్తాన్‌ సిరీస్ అంటేనే ఇరు దేశాల ప్రేక్షకుల్లో హైటెన్షన్ వాతావరణం ఏర్పడుతుంది. ఈ నేపథ్యంలోనే 2004లో భారత జట్టు పాక్‌లో పర్యటించింది. పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. ఆ సిరీస్‌ నేపథ్యంలో ముల్తాన్‌‌లో జరిగిన టెస్టులో వీరూ విధ్వంసకర బ్యాటింగ్‌తో పాక్‌ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ట్రిపుల్‌ సెంచరీ(309 పరుగులు) చేసి పాక్ గడ్డపై ట్రిపుల్ సెంచరీ చేసిన తొలి భారత బ్యాట్స్‌మన్‌గా రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు ఈ ఆటకు గానూ ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు కూడా అందుకున్నాడు.

అప్పటి విషయాలను సెహ్వాగ్ తన ట్విటర్ ఖాతా ద్వారా సోమవారం అభిమానులతో పంచుకున్నాడు. ‘పాకిస్తాన్‌లో సిరీస్ ఆడుతూ అక్కడి ముల్తాన్‌లో ఆ జట్టుపైనే ఈ ఘనత సాధించాను. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత మళ్లీ అదే రోజు దక్షిణాఫ్రికాపై 319 పరుగులు చేశాను. యాధృచ్చికమో, అలా రాసి ఉందో ఏమో. అందుకే మార్చి 29.. నాకు ఎంతో ప్రత్యేకమైన తేదీ. టెస్టు క్రికెట్‌లో ట్రిపుల్‌ సెంచరీ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా గౌరవం లభించింది’ అంటూ తన పాత వీడియోను ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ క్రమంలో అభిమానులు కూడా చాలా ఎమోషనల్ అయ్యారు. ‘ముల్తాన్‌ కా సుల్తాన్‌.. వీరూ పా.. నీ అద్భుత ఇన్నింగ్స్‌ చాలా మిస్పవుతున్నాం’ అంటూ కామెంట్లు చేశారు.

ఇదిలా ఉంటే ఆ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న టీమిండియా.. పాకిస్తాన్‌పై ఇన్నింగ్స్‌ 52 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ నేపథ్యంలో తన తొలి ట్రిపుల్‌ సెంచరీకి 17 ఏళ్లు నిండిన సందర్భంగా సెహ్వాగ్‌ ఆనాటి జ్ఞాపకాలు గుర్తుచేసుకున్నాడు.



మరింత సమాచారం తెలుసుకోండి: