వరల్డ్ టెన్నిస్ ఆటలో గత కొంత కాలం వరకు ఎక్కువగా ముగ్గురి ఆటగాళ్ళ హవానే కొనసాగింది. వారిలో వరల్డ్ నంబర్ వన్ ఆటగాడిగా కొనసాగిన సెర్బియా ఆటగాడు నోవాక్ జోకోవిచ్, స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ మరియు స్విస్ ఆటగాడు రోజర్ ఫెదరర్ లు ఉన్నారు. వీరు ముగ్గురికి ప్రపంచ వ్యాప్తంగా ఏ స్థాయిలో అభిమానులు ఉన్నారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. వీరి ముగ్గురిలో తక్కువ వయసున్న ఆటగాడు నోవాక్ జోకోవిచ్ తనదైన దూకుడు ఆటతీరుతో వారిద్దరినీ అధిగమించి నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకున్నాడు.

గత 2020 ఫిబ్రవరి నెల నుండి జోకొవిచ్ వరల్డ్ నంబర్ వన్ ర్యాంక్ లో కొనసాగుతూ వచ్చాడు. కానీ ఇక ఈ ర్యాంక్ తన పేరిట ఉండేది కేవలం మూడు రోజులే అని తేలిపోయింది. ప్రస్తుతం దుబాయ్ ఓపెన్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొన్న జొకోవిచ్ కనీసం సెమీ ఫైనల్ కు చేరుకున్నా తన నంబర్ వన్ ర్యాంక్ కు ఈ మాత్రం డోకా ఉండేది కాదు. కానీ అనూహ్యంగా నిన్న జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ లో జోకోవిచ్ 123 ర్యాంక్ లో ఉన్న చెక్ రిపబ్లిక్ ఆటగాడు జిరి వెస్లి చేతిలో 4-6, 6-7 తేడాతో వరుస సెట్ లలో ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించడమే కాకుండా, తన నంబర్ వన్ ర్యాంక్ ను అనధికారికంగా నిన్ననే కోల్పోయాడు.

ఈ ఓటమితో జోకోవిచ్ తన నంబర్ వన్ ర్యాంక్ ను కోల్పోయి రెండవ స్థానానికి పడిపోయాడు. ఈ విషయాన్ని అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య అధికారికంగా ఫిబ్రవరి 28 సోమవారం ప్రకటించనుంది. అయితే జోకోవిచ్ ఓటమి రష్యా స్టార్ ఆటగాడు డానియల్ మెద్వెదెవ్‌ కు కలిసి వచ్చింది అని చెప్పాలి. సోమవారం నుండి అధికారికంగా మెద్వెదెవ్‌ నంబర్ వన్ ర్యాంక్ ను సొంతం చేసుకోనున్నాడు. ఇది ఒక రికార్డ్ అని చెప్పాలి 18 సంవత్సరాల తర్వాత ఫెదరర్, నాదల్, ముర్రే మరియు జోకోవిచ్ లు కాకుండా 5 వ ఆటగాడు నంబర్ వన్ ర్యాంక్ కు చేరుకోవడం గమనార్హం. మరి మెద్వెదెవ్‌ ఎంతకాలం ఈ నంబర్ వన్ ర్యాంక్ ను నిలబెట్టుకోగలడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: