ఇంటర్నెట్ డెస్క్: దివాలా తీసే స్థాయి నుంచి ప్రపంచ కుబేరుడిగా ఎదిగాడు.. ఎలాన్ మస్క్. బిజినెస్ మ్యాన్‌గా అత్యున్నత స్థాయికి చేరాడు. టెస్లా, స్పేస్ ఎక్స్ సంస్థల సక్సెస్‌తో ఆయన ఈ ఘనత సాధించాడు. టెస్లా షేర్ల విలువ 4.8 శాతం పెరగడంతో ప్రపంచ కుబేరుల్లో మస్క్ నెంబర్ వన్ స్థానానికి చేరాడు. మొన్నటివరకు బిలియనీర్లలో రెండో స్థానంలో ఉన్న మస్క్.. ఇప్పుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్‌ను వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.

ప్రస్తుతం ఎలాన్ మస్క్ నికర ఆస్తుల విలువ 188.5 బిలియన్ డాలర్లుగా ఉంది. దీంతో 188 బిలియన్ డాలర్లతో గత మూడేళ్లుగా అగ్రస్థానంలో కొనసాగుతున్న బెజోస్ రెండో స్థానానికి పడిపోయాడు. విచిత్రం ఏంటంటే సరిగ్గా ఓ ఏడాది క్రితం మస్క్ ఆస్తుల విలువ కేవలం 38  బిలియన్ డాలర్లు మాత్రమే. స్పేస్ ఎక్స్ వరుసగా విఫలం కావడం, టెస్లా బులెట్ ప్రూఫ్ కారు ఎక్స్‌పో షోలోనే పగిలిపోవడం.. ఇలా అనేక ప్రతి కూల పరిస్థితులు మస్క్‌కు ఎదురయ్యాయి.

దీంతో అప్పటి పరిస్థితుల్లో ఆయన ఆ ఆస్తిని కూడా నిలుపుకోవడం కష్టంగానే కనిపించింది. కానీ మస్క్ పట్టు వదలకుండా పోరాడాడు. దీంతో కేవలం 12 నెలల వ్యవధిలోనే ఆయన ఆస్తి ఏకంగా 150 బిలియన్ డాలర్లు పెరిగింది. కేవలం ఒక్క ఏడాదిలో ఈ స్థాయిలో సంపద పెంచుకున్న ఏకైక బిలియనీర్‌గా మస్క్ చరిత్ర సృష్టించాడు. దీనికి ప్రధాన కారణం టెస్లా కంపెనీయేనని నిపుణులు చెబుతున్నారు.

గతేడాది టెస్లా పరిస్థితి దారుణంగా ఉంది. ఫోర్డ్ తదితర మోటార్ కంపెనీలతో పోల్చితే అతి తక్కువ కార్లను మాత్రమే టెస్లా ఉత్పత్తి చేసింది. కేవలం 5 లక్షల కార్లను మాత్రమే మార్కెట్లోకి తీసుకురాగలిగింది. అయితే ఈ సారి టెస్లాకు ప్రతి పరిణామం అనుకూలంగా మారింది. తాజాగా అధికారంలోకి వచ్చిన బైడెన్ ప్రభుత్వం ఇంధన కార్లకంటే ఎలక్ట్రిక్ కార్ల వైపే మొగ్గు చూపే అవకాశం ఉండడంతో టెస్లాపై ప్రజల్లో ఆసక్తి పెరిగింది. దీంతో ఆ కంపెనీ షేర్ల విలువ అమాంతం పెరిగిపోయింది.

భవిష్యత్తంతా ఎలక్ట్రిక్ కార్లదే కావడంతో అందులో టెస్లానే అగ్రగామిగా రాణిస్తుందని మదుపర్లు భావిస్తున్నారు. దీంతో టెస్లా షేర్లను అధిక ధరలకు కొనుగోలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ కంపెనీ షేర్ల విలువ భారీగా పెరిగింది. ఒక్క మస్క్ మాత్రమే కాదు.. ప్రపంచదేశాల్లోని టాప్ 500 మంది ధనికులంతా 1.8 ట్రిలియన్ డాలర్లు అధిక సంపాదనను ఈ ఏడాది ఆర్జించినట్లు తెలుస్తోంది. అంటే ప్రపచంలోని బిలియనీర్ల ఆస్తుల విలువ దాదాపు 31 శాతం పెరిగిందన్న మాట.

మరింత సమాచారం తెలుసుకోండి: