ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ పై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ మండిప‌డ్డారు. మోహన్ భగవత్ విజయదశమి ప్రసంగం అబద్ధాలు, సగం సత్యాలతో ఉందని, అంద‌రూ వీటిపై ఆలోచించాల‌ని  ఒవైసీ కోరారు. జనాభా విధానం, ఆర్టికల్ 370 రద్దు ఇతర అంశాలపై భగవత్ చేసిన వ్యాఖ్యలు ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా ఉన్నాయ‌న్నారు. ముస్లిములు, క్రిస్టియన్ల జనాభా పెరిగిందనే అబద్ధాన్ని ఆయ‌న ప‌దే ప‌దే పునరావృతం చేశారని, ముస్లిం జనాభా పెరుగుదల రేటు తక్కువగా ఉందని, కావాలంటే గ‌ణాంకాలు ప‌రిశీలించుకోవ‌చ్చ‌న్నారు. బాల్య వివాహాలు, సెక్స్ సెలెక్టివ్ అబార్షన్‌ల సామాజిక దురాచారాల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం ఉందని, వీటిపై ప్ర‌జ‌ల్లో అవ‌గాహ‌న పెంచాల‌న్నారు. కశ్మీర్‌లో ప్రజలు ఆర్టికల్ 370ని రద్దు చేయడం వల్ల ప్రయోజనాలు పొందుతున్నారని భగవత్ నివేదించిన వ్యాఖ్యలపై ఒవైసీ మండిప‌డ్డారు. హ‌త్య‌లు ఎందుకు జ‌రుగుతున్నాయ‌ని ప్ర‌శ్నించారు. దీనివల్ల ఇంటర్నెట్ షట్‌డౌన్‌లు, సామూహిక నిర్బంధాలతో కశ్మీరు ఒక రావణ‌కాష్టంలా మారింద‌ని, స‌గం నిజం, స‌గం అబ‌ద్దం చెప్ప‌డంవ‌ల్ల ఎటువంటి ఉప‌యోగ‌డం ఉంద‌ని భ‌గ‌వ‌త్‌కు హిత‌వు ప‌లికారు.

మరింత సమాచారం తెలుసుకోండి: