అవును, మీరు విన్నది నిజమే. పురావస్తు పరిశోధనల్లోనే భాగంగా ఈ వింత విషయం బయల్పడింది. సముద్రపు అడుగున 7000 ఏండ్ల నాటి రోడ్డు మార్గం బయట పడడం ఇపుడు అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇంతకీ ఇది ఎక్కడ బయపడింది అని అనుకుంటున్నారా? మధ్యదరా సముద్రం అట్టడుగున మట్టి వెనుక ఈ పురాతన రహదారిని పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ రహదారి క్రొయేషియన్ ద్వీపంలో ఉన్న కోర్కులా ద్వీపం తీరంతో హ్వార్ సంస్కృతి యొక్క మునిగిపోయిన పూర్వ స్థావరాన్ని కలుపుతుందని భావిస్తున్నారు.

దీనిని పరీక్షించిన పిదప చాలా ఆసక్తికరమైన విషయాలను వారు వెల్లడించారు. ఈ రహదారి 4 మీటర్ల వెడల్పుతో జాగ్రత్తగా పేర్చబడిన రాతి పలకలతో రూపొందించబడిందని అన్నారు. పురావస్తు పరిశోధనల్లో భాగంగా దొరికిన వుడ్‌ను రేడియోకార్బన్ అనాలిసిస్ ద్వారా పరిశీలించగా ఈ విషయాలు తెలిశాయని "క్రొయేషియా యూనివర్సిటీ ఆఫ్ జదర్" పరిశోధకులు తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్లో పోస్టులు చేశారు.

ఈ పోస్టులో దాదాపు 7000 సంవత్సరాల కిందట ఈ రోడ్డుపై ప్రజలు నడిచేవారని రాసుకొచ్చారు. నియోలిథిక్ సెటిల్‌మెంట్‌లో ఈ రహదారి భాగమని చెబుతున్నారు. ఇకపోతే కొర్కులా ద్వీపంలోని వెలా లుక సమీపంలో గ్రాండినా బే వద్ద జరిగిన భూ పరిశోధనలో భాగంగా సముద్రం అట్టడుగున ఈ పురాతన రహదారిని పరిశోధకులు కనుగొనడం జరిగింది. ఈ ప్రదేశంలో చెకుముకి బ్లేడ్‌లు, రాతి గొడ్డళ్లు వంటి నియోలిథిక్ కళాఖండాలు కూడా బయటపడ్డాయని కూడా చెప్పుకొచ్చారు.

మరోవైపు, సోలిన్ సైట్ ఇంకా పూర్తిగా త్రవ్వలేదని, హ్వార్ సంస్కృతి మరియు దాని జీవన విధానం గురించి మనకు తెలియనివి ఇంకా చాలా ఉన్నాయని పరిశోధకులు చెప్పడం గమనార్హం. ఇక ఆ రహస్యాలు గాని తెలుసుకుంటే 7000 ఏండ్ల క్రితం నాటి చరిత్రను పూర్తిగా అవగాహన చేసుకోవచ్చు. అప్పటి ప్రజల జీవన విధానం, సంస్కృతీసంప్రదాయాలు, ముఖ్యంగా వాతావరణ పరిస్థితులను ఓ అంచనా వేయొచ్చు. తద్వారా ఇప్పటి జీవన స్థితిగతులకు, అప్పటి వారి జీవనశైలిలో మార్పులకు వున్న తేడాలు తెలుస్తాయని అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: