తనకు ఎక్కడా మద్దతు దొరకటం లేదని అనుకున్నాడో ఏమో ఆఖరు ప్రయత్నంగా బ్లాక్ మెయిలంగ్ కే దిగేశాడు చంద్రబాబునాయుడు.  జూమ్ యాప్ ద్వారా సోమవారం మీడియా సమావేశం నిర్వహించిన చంద్రబాబు ఏకంగా జగన్మోహన్ రెడ్డినే బ్లాక్ మెయిలింగ్ చేయటమే ఆశ్చర్యంగా ఉంది. మూడు రాజధానుల అంశాన్ని జగన్ ఉపసంహరించుకోవాలని లేకపోతే అందరూ ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయాలంటూ సవాలు విసిరారు. అందుకు 48 గంటలు డెడ్ లైన్ విధించాడు. మూడు రాజధానుల అంశం వైసిపి సొంత విషయం కాదని రాష్ట్రంలోని 5 కోట్ల మంది ప్రజల భవిష్యత్తుకు సంబంధించిన విషయంగా  చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. మూడు రాజధానుల బిల్లుపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ సంతకం పెట్టిన రోజు నుండి  చంద్రబాబు మండిపోతున్నాడు. ప్రభుత్వ నిర్ణయంపై ఉద్యమాలు చేయాలని, తిరగబడమని చంద్రబాబు ఇచ్చిన పిలుపును జనాలు ఎవరూ పట్టించుకోలేదు. దాంతో చివరకు తానే నేరుగా బ్లాక్ మెయిలింగ్ కు దిగేశాడు.




తమ పార్టీకి చెందిన 23 మంది ఎంఎల్ఏలు రాజీనామాలు చేయటం పెద్ద విషయం కాదంటూనే ముందు వైసిపి ఎంఎల్ఏలు రాజీనామాలు చేయాలని డిమాండ్ చేయటమే విచిత్రంగా ఉంది. వైసిపి ఎంఎల్ఏలు రాజీనామాలు చేస్తారో లేదో తెలీదు. టిడిపి ఎంఎల్ఏలతో  రాజీనామాలు చేయించటం చంద్రబాబు చేతిలో పనేకదా ? ముందు ఆపని ఎందుకు చేయటం లేదో అర్ధం కావటం లేదు. జగన్ కు 48 గంటలు టైం ఇస్తున్నట్లు పదే పదే చెప్పాడే కానీ తర్వాత తాను ఏమి చేయబోతున్నాడో మాత్రం చంద్రబాబు చెప్పలేదు. రాజధాని అంశం ప్రజలందరికీ సంబంధించిన విషయం అని ఇపుడు చెప్పిన చంద్రబాబుకు ఇదే విషయం ఐదేళ్ళ క్రితం గుర్తుకురాలేదా ? అమరావతిని రాజధానిగా నిర్ణయించినపుడు ఎవరినడిగి చంద్రబాబు డిసైడ్ చేశాడు ?




రాజధానిని ఎక్కడ పెట్టాలనే విషయంలో చంద్రబాబు అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాడా ? పోనీ అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపితో చర్చించాడా ? అదీ కాకపోతే జనాభిప్రాయాన్ని సేకరించాడా ? ఏమీ చేయకుండా తనిష్ట ప్రకారమే ఏకపక్షంగా అమరావతిని రాజధానిగా డిసైడ్ చేసింది నిజం కాదా ?  మూడు రాజధానుల ఏర్పాటును జగన్ మ్యనిఫెస్టోలో గానీ ఎన్నికల సమయంలో కానీ చెప్పాడా ? అని అడుగుతున్నాడు. మరి అమరావతిని రాజధానిగా చేస్తానని చంద్రబాబు ఏమన్నా 2014 ఎన్నికల సమయంలో చెప్పాడా ? రైతుల భూములను సమీకరించి సింగపూర్ కన్సార్షియంతో అంతర్జాతీయ రాజధానిని నిర్మిస్తానని ప్రజలకు చెప్పాడా ? ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పాడా ? లేదు కదా.  ఐదేళ్ళ పాలన తర్వాత 2019లో జరిగిన ఎన్నికల్లో టిడిపి చిత్తుగా ఓడిపోవటమే కాకుండా మంగళగిరిలో స్వయంగా కొడుకు లోకేష్ ఓడిపోయాడంటే చంద్రబాబు పాలనతో పాటు స్విస్ చాలెంజ్ కాన్సెప్ట్ ను జనాలు తిరస్కరించారనే కదా అర్ధం.




మూడు రాజధానుల అంశంపై ఒకవైపు న్యాయపోరాటాలు చేస్తామని చెబుతున్న చంద్రబాబు మళ్ళీ రాజీనామాల సవాల్ ఎందుకు చేస్తున్నట్లు ?  మూడు రాజధానుల కాన్సెప్టుకు జనాల మద్దతు సంపూర్ణంగా ఉందో లేదో తెలీదు కానీ  చంద్రబాబును తిరస్కరించార్నది వాస్తవమే కదా. ఎంతసేపు  జగన్ ప్రభుత్వం రద్దయిపోవాలి, ఎన్నికలు జరగాలి వెంటనే అధికారంలోకి వచ్చేయాలన్నదే చంద్రబాబు ఆతృతంతా. తనకు వ్యతిరేకంగా ప్రజాతీర్పును కూడా ఐదేళ్ళు సహించలేకపోతున్నాడు చంద్రబాబు. ప్రభుత్వ నిర్ణయం నచ్చకపోతే ఎక్కడైనా ప్రతిపక్ష సభ్యులు రాజీనామాలు చేస్తారు కానీ అధికారపార్టీ ఎంఎల్ఏలు రాజీనామా ఎందుకు చేస్తారు ?  చంద్రబాబు మీడియా సమావేశంలో మాట్లాడిన విధానం చూస్తుంటే తన పిలుపును ఎవరూ పట్టించుకోలేదన్న ఉక్రోషమే కనబడుతోంది. పైగా గవర్నర్ సంతకం పెట్టడాన్ని బిజెపి స్వాగతించటాన్ని  అస్సలు తట్టుకోలేకపోతున్నాడు.



చంద్రబాబు మాటల్లో అమరావతి ప్రాంతంలో తన మద్దతుదారులు పెట్టిన పెట్టుబడులేమైపోతాయి ? వాళ్ళ భవిష్యత్తేమిటి ? అనే టెన్షనే కనబడుతోంది. నిజంగా అమరావతిపై చంద్రబాబుకు అంత ప్రేమే ఉంటే ఐదేళ్ళల్లో ఒక్క శాశ్వత భవనం కూడా ఎందుకు నిర్మించలేకపోయాడో సమాధానం చెప్పాలి. చంద్రబాబు డెడ్ లైన్ విషయంలో జగన్ ఎలా స్పందిస్తాడు ? అసలు పట్టిచుకోనే అవకాశమే లేదు. తాను అధికారంలో ఉన్నపుడు తానిష్టం వచ్చినట్లు చేసుకువెళ్ళాడు. తనింటి వ్యవహారం లాగ చేసుకుపోయాడు. ఇపుడు జగన్ కూడా అదే పద్దతిలో వెళుతున్నాడు. చంద్రబాబు విధానాన్ని జనాలు ఐదేళ్ళ తర్వాత తిరస్కరించినట్లే జగన్ను కూడా తిరస్కరిస్తారనటంలో సందేహం లేదు. మరి రాష్ట్ర భవిష్యత్తంటారా...


 



మరింత సమాచారం తెలుసుకోండి: