తెలంగాణ కాంగ్రెస్ లో విభేదాలు ఆగ‌డం లేదా..? రోజుకొక కొత్త స‌మ‌స్య‌తో రేవంత్ ఇబ్బంది ప‌డుతున్నాడా..? ప్ర‌శాంతంగా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ కాద‌నే నానుడిని నేత‌లు నిజం చేస్తున్నారా..? అంటే ప్ర‌స్తుత ప‌రిస్థితులు చూస్తే అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి. తాజాగా కాంగ్రెస్ లో మాదిగ నేత‌ల‌కు అన్యాయం జ‌రుగుతోంద‌ని ఆ వ‌ర్గం నేత‌లు గ‌ళ‌మెత్తారు. రేవంత్ రెడ్డి సార‌థ్యంలోని క‌మిటీలో మాదిగ‌ల‌కు స్థానం క‌ల్పించ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

గ‌త ఏడాది జూన్‌లో కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణ‌లో కొత్త కార్య‌వ‌ర్గాన్ని ఏర్పాటు చేసింది. అంత‌కుముందు ఉన్న ఉత్త‌మ్ టీంను ర‌ద్దు చేసి రేవంత్ సార‌థ్యంలో కొత్త క‌మిటీని ప్ర‌క‌టించింది సోనియా గాంధీ. మొత్తం కార్య‌వ‌ర్గం, క‌మిటీల కూర్పులో సామాజిక కోణాన్ని బ‌ట్టి ఎంపిక చేసింది. గ‌తంలో న‌లుగురు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండ‌గా.. ప్ర‌స్తుతం ఐదుగురిని నియ‌మించారు. ఇందులో గీతా రెడ్డి, అంజ‌న్ కుమార్‌, అజారుద్దీన్‌, జ‌గ్గారెడ్డి, మ‌హేశ్ గౌడ్ ఉన్నారు. త‌ద్వారా ఎస్సీ, బీసీ, మైనారిటీ, ఓసీ వ‌ర్గాల‌కు ప‌ద‌వులు ఇచ్చింది.

10 మంది సీనియ‌ర్ ఉపాధ్య‌క్షుల నియామ‌కంలోనూ సామాజిక కూర్పు పాటించింది. ఇందులో.. సంభాని చంద్ర‌శేఖ‌ర్‌, దామోద‌ర్ రెడ్డి, మ‌ల్లు ర‌వి, వేం న‌రేంద‌ర్‌, పొదెం వీర‌య్య‌, సురేష్ షెట్కార్‌, ర‌మేశ్‌, జి నిరంజ‌న్‌, కుమార్ రావు, జావీద్ అమీర్ ఉన్నారు. ఎస్సీలు ముగ్గ‌రు, ముగ్గ‌రు ఓసీలు, ఒక ఎస్టీ, ఇద్ద‌రు బీసీలు, ఇక మైనార్టీ నాయ‌కుడికి అవ‌కాశం ఇచ్చింది.

ఇక ప్ర‌చార క‌మిటీ చైర్మ‌న్ గా బీసీ నేత మ‌ధుయాష్కీ గౌడ్ కు, క‌న్వీన‌ర్ గా మైనారిటీ నాయ‌కురాలు స‌య్య‌ద్ అజ్మ‌తుల్లా హుస్సేనీకి స్థానం క‌ల్పించింది. ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ క‌మిటీ బాధ్య‌త‌ల‌ను ఎస్సీ నేత‌, మాజీ ఉప ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహకు ఇవ్వ‌గా.. ఏఐసీసీ కార్య‌క్ర‌మాల నిర్వ‌హ‌ణ క‌మిటీ బాధ్య‌త‌ల‌ను ఏలేటి మ‌హేశ్వ‌ర్ రెడ్డికి అప్ప‌గించింది. ఇలా ప‌ద‌వుల పంప‌కంలో అధిష్ఠానం సామాజిక స‌మ‌తూకం పాటించిన‌ట్లు నేత‌లు చెబుతున్నా మాదిగ నేత‌లు మాత్రం అసంతృప్తిగా ఉన్నారు.

త‌మ వ‌ర్గానికి ఎక్కువ ప‌ద‌వులు రాలేద‌ని అల‌క బూనారు. ఈనెల 9న గాంధీభ‌వ‌న్ ఎదుట ఆవేద‌న దండోరా కార్య‌క్ర‌మం చేప‌డ‌తామ‌ని వెల్ల‌డించారు. త‌మకు జ‌రిగిన అన్యాయంపై సోనియా, రాహుల్‌, ప్రియాంక గాంధీలకు లేఖ రాస్తామ‌ని తెలిపారు. గాంధీ భ‌వ‌న్‌లో స‌మావేశానికి అనుమ‌తి ఇవ్వ‌క‌పోవ‌డం వ‌ల్లే ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన‌ట్లు చెప్పారు. ఇప్ప‌టికే నేత‌ల మ‌ధ్య ఆధిప‌త్య పోరుతో స‌త‌మ‌త‌మ‌వుతున్న రేవంత్ కు తాజా ప‌రిణామం మింగుడుప‌డ‌ని విష‌య‌మే.  చూడాలి మ‌రి అధిష్ఠానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో..?

 

మరింత సమాచారం తెలుసుకోండి: