ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వంతో ఉద్యోగస్తుల జగడం మరింత ముదిరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని ఉద్యోగ సంఘం నేతలు మరోసారి స్పష్టం చేశారు. ఇవాళ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ సమ్మె నోటీసు ఇచ్చి తీరుతామని అంటున్నారు. ప్రభుత్వంతో అమీ తుమీ కే సిద్ధపడిన ఉద్యోగ సంఘాల నేతలు.. ఇవాళ ప్రభుత్వం పిలిచిన చర్చలకు రాబోమని తేల్చి చెప్పారు. పీఆర్సీ సాధన సమితి పేరిట ఐక్యపోరాటానికి దిగుతున్న ఉద్యోగ సంఘాల నేతలు.. పీఆర్సీ జీవోలు రద్దు చేస్తేనే చర్చలకు వస్తామని స్పష్టం చేస్తున్నారు.


ఈ మేరకు ఉద్యోగ సంఘాల నేతలు.. సీఎంఓ అధికారికి ఫోన్ చేసి తమ నిర్ణయం చెప్పేశారు. సోమవారం  సీఎస్‌కు సమ్మె నోటీసు ఇస్తామంటున్న పీఆర్సీ సాధన సమితి నేతలు.. మధ్యాహ్నం 3 గం.కు సమ్మె నోటీసు ఇస్తామని తెలిపారు. తమవి గొంతెమ్మ కోరికలు కాదని.. చాలా న్యాయమైన డిమాండ్లు మాత్రమే అడుగుతున్నామని పీఆర్సీ సాధన సమితి నేతలు చెబుతున్నారు. తమతో పాటు ఒప్పంద, పొరుగుసేవల సిబ్బందికి కూడా లబ్ధి జరిగే వరకు పోరాటం ఆగబోదని పీఆర్సీ సాధన సమితి నేతలు చెబుతున్నారు.


ప్రభుత్వం చర్చల కోసం ఓ కమిటీ వేసింది కదా.. అని విలేకరులు అడిగితే.. అసలు తమతో చర్చలకు కమిటీ వేసినట్లు అధికారిక సమాచారం ఏమీ అందలేదన్నారు పీఆర్సీ సాధన సమితి నేతలు.. ఆ కమిటీ ఏంటో.. దాని పరిధి, నిర్ణయాధికారం ఏటో ఇప్పటి వరకూ స్పష్టత లేదని చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు చర్చలకు రావాలని పిలిచారని.. కానీ.. జీవోల అమలు నిలిపివేస్తూ ఉత్తర్వు ఇచ్చేవరకు చర్చలకు వెళ్లేది లేదని పీఆర్సీ సాధన సమితి నేతలు తెగేసి చెబుతున్నారు.


ప్రస్తుతానికి పీఆర్సీ వ్యవహారం తేలేవరకూ పాత జీతాన్నే ఇవ్వాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. అసలు అశుతోష్‌ మిశ్రా కమిటీ నివేదిక ఏమిచ్చిందో బయటపెట్టాలని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. తాము ఉద్యమ కార్యాచరణలో పార్టీలను ఆహ్వానించలేదని.. ప్రభుత్వంపై మేం యుద్ధం ప్రకటించలేదని.. ఇది ప్రభుత్వానికి నిరసన తెలిపే కార్యక్రమం మాత్రమేనని పీఆర్సీ సాధన సమితి నేతలు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: