పవన్ కల్యాణ్ అంటేనే తెలుగు సినిమా పరిశ్రమలో ఒక సెంటిమెంటులా మారిపోయిన సంగతి అందరికీ తెలుసు. తమతమ సినిమాల్లో ఒక పవన్ డైలాగు పెట్టుకోవడం, గోడమీద పవన్ ఫోటో పెట్టుకోవడం, పవన్ పాటను రీమిక్స్ చేసుకోవడం ఇలాంటి అనేకానేక టెక్నిక్కులను నవతరం హీరోల్లో చాలా మంది రెగ్యులర్గా పాటిస్తూనే ఉన్నారు. అలాగే హీరోయిన్ లకు కూడా పవన్ కల్యాణ్ ఒక సెంటిమెంటు అవునో కాదో గానీ.. మొత్తానికి ఆయన సరసన నటించే ఛాన్స్ అంటూ వస్తే దాని వల్ల తాము కొంత మేర ప్రమోట్ అయిపోతాం అని మాత్రం హీరోయిన్లు నమ్ముతున్నట్లుగా ఉంది. ఒకసారి పవన్ సరసన ఛాన్సు దక్కించుకున్నట్లయితే..  ఆ క్రేజ్ ను వాడుకుంటూ.. దాని వెంబడి అనేక సినిమాల్లో చాన్సులు దక్కించుకోవచ్చునని చాలా మంది నమ్ముతున్నట్లే ఉన్నారు.

తాజాగా గబ్బర్ సింగ్ 2 చిత్రంలో పవన్ సరసన ఆడి పాడడానికి లక్ష్మీ రాయ్ కు అవకాశం లభించింది. ఈ చాన్స్ తన కెరీర్ కు బాగా హెల్ప్ అవుతుందని అమ్మడు మురిసిపోతున్నదిట. లక్ష్మీ రాయ్ తమిళ పరిశ్రమకు చెందిన హీరోయిన్ అయినప్పటికీ తెలుగులో గతంలో కూడా ఆమెకు చెప్పుకోదగ్గ అవకాశాలే వచ్చాయి. బాలక్రిష్ణ సరసన కూడా ఓ చిత్రంలో చేసింది. అయితే.. వరుస అవకాశాలు మాత్రం శూన్యం. అందం పరంగా, ఉన్న అందాల ఆరబోత పరంగా అభ్యంతరం చెప్పే నాయిక కాదు గానీ.. సంఖ్యాపరంగా తెలుగులో అవకాశాలు మాత్రం ఎక్కువగా రాలేదు.

అయితే ఇప్పుడు పవన్ సరసన చేయబోతున్న ఛాన్స్ మాత్రం లక్కీ యేనని ఆ ముద్దుగుమ్మ చెప్పుకుంటున్నదిట. దీనివల్ల ముందు ముందు కూడా మరిన్ని అవకాశాలు రాగలవని అంటున్నదిట. అంటే తన స్టార్ డం ప్రమోట్ అవుతుందని నమ్ముతున్నదన్నమాట. ఇంతా కలిపి ఈ సర్దార్ చిత్రంలో ఈ అమ్మడు చేస్తున్నది కనీసం సెకండ్ హీరోయిన్ పాత్ర కూడా కాదు. కేవలం ఐటం భామగా మాత్రమే. పవన్ .. పవర్ స్టారే అయినప్పటికీ.. ఆయన సరసన చేసిన ఐటం భామకు కూడా అవకాశాల ప్రమోషన్ వస్తుందనుకోవడం భ్రమ. అయితే ఈమె కాన్ఫిడెంట్ గా ఉండడానికి మరో కారణం కూడా ఉంది. ఇది కేవలం పాటలో మాత్రం మెరిసి, డ్యాన్స్ చేసి మాయమైపోయే పాత్ర మాత్రమే కాదని..  పాటతో కథలోకి ఎంటరై నప్పటినుంచి.. కథ క్లయిమాక్స్ వరకు.. కథలో కీలకంగా ఉండే ముఖ్యమైన పాత్ర అని చెప్పుకుంటూ ఉన్నది. ఆమె ఆశలు పెంచుకోవడం సహజమే గానీ.. నిజంగానే పవన్ చిత్రం ఆమెకు నటిగా ప్రమోషన్ ఇస్తుందో లేదో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: