ద‌క్షిణాది సూప‌ర్ స్టార్‌లు మాత్ర‌మే కాదు.. ద‌శాబ్దాల క్రిత‌మే ఉత్త‌రాదినా త‌మ‌కంటూ మార్కెట్ సాధించుకున్న‌ ఘ‌న‌త ర‌జ‌నీకాంత్‌, క‌మ‌ల్‌హాస‌న్‌ల‌ది. వీరు బాలీవుడ్‌లోనూ ప‌లు సినిమాలు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ద‌క్షిణాదిన ఉన్నంత కంఫ‌ర్ట్ అక్క‌డ లేద‌ని ఇక్క‌డే సినిమాలు చేయాల‌ని ఆ త‌రువాత కాలంలో ఫిక్సైపోయారు. ఇక హీరోలుగా వీరిద్ద‌రి కాంబోలో మ‌ల్టీ స్టార‌ర్ సినిమాలు ఇప్ప‌టివ‌ర‌కు రాలేదు. అయితే వీరిద్ద‌రూ క‌లిసి న‌టించిన సినిమాలు లేవ‌నుకుంటే పొర‌పాటే. అస‌లు వీరిద్ద‌రూ కెరీర్ ప్రారంభంలో క‌లిసి న‌టించిన సినిమాలే ఎక్కువ‌. కాకుంటే ఇప్ప‌టి సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ అప్పుడు నెగిటివ్ రోల్స్ పోషిస్తే.. క‌మ‌ల్ మాత్రం హీరోగా న‌టించాడు. ఆ త‌ర్వాత కాలంలో ర‌జ‌నీకాంత్ త‌న‌దైన శైలి స్టైలిష్ యాక్ష‌న్‌తో కోలీవుడ్ సూప‌ర్ స్టార్ స్థాయికి ఎదిగాడు. క‌మ‌ల్ విభిన్న‌మైన పాత్ర‌ల్లో న‌టిస్తూ,  విలక్ష‌ణ న‌టుడిగా త‌న ప్ర‌త్యేక‌త‌ను కాపాడుకుంటూ వ‌స్తున్నాడు. ఇక వీరిద్ద‌రినీ క‌లిపి ఒకే సినిమాలో న‌టించ‌ప‌జేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌క‌పోలేదు. గ్రేట్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ద‌ళ‌ప‌తి చిత్రంలో మ‌మ్ముట్టి పోషించిన పాత్ర కోసం మొద‌ట అనుకున్న‌ది క‌మ‌ల్‌హాస‌న్ నే.
 
       అయితే వీరిద్ద‌రి స్టార్డ‌మ్ ను బ్యాలెన్స్ చేయ‌డం, అభిమానుల‌ను స‌మాన స్థాయిలో మెప్పించ‌డం క‌త్తిమీద సాముగా భావించిన మ‌ణిర‌త్నం మ‌న‌సు మార్చుకుని క‌మ‌ల్ స్థానంలో మాలీవుడ్ స్టార్ మ‌మ్ముట్టిని ఎంపిక చేసుకున్నాడు. ఒక‌వేళ ఆ పాత్ర‌ల్లో క‌మ‌ల్‌, ర‌జ‌నీ న‌టించి ఉంటే తెర‌పై వారిద్ద‌రి మ‌ధ్య క్లాష్ వ‌స్తే థియేట‌ర్లో అభిమానుల మ‌ధ్య రావ‌డం ఖాయ‌మ‌ని భావించే త‌న నిర్ణ‌యం మార్చుకున్నాన‌ని అప్ప‌ట్లో మ‌ణిర‌త్నం స్వ‌యంగా వెల్ల‌డించారు కూడా. మ‌హాభార‌తంలోని దుర్యోధ‌నుడు, క‌ర్ణుడి మ‌ధ్య స్నేహాన్ని స్ఫూర్తిగా తీసుకుని మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన ద‌ళ‌ప‌తి చిత్రం ఘ‌న‌విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఇక ఆ తరువాత కూడా ఆ ఇద్ద‌రినీ క‌లిపి తెర‌పై చూపించేందుకు ఏ ద‌ర్శ‌కుడూ ధైర్యం చేయ‌లేక‌పోయారు. ఎంజీ రామ‌చంద్ర‌న్‌, క‌రుణానిధిల నిజ జీవిత క‌థ స్ఫూర్తితో మ‌ణిర‌త్నం రూపొందించిన ఇద్ద‌రు చిత్రంలో కూడా వివాదాస్ప‌దం కాని రీతిలోనే మ‌ణిరత్నం న‌టుల‌ను ఎంపిక చేసుకున్నారు. వృత్తిప‌ర‌మైన పోటీ ఉన్నా అప్ప‌టికీ ఇప్ప‌టికీ మంచి స్నేహితులుగానే కొన‌సాగుతున్న ర‌జ‌నీ, క‌మ‌ల్ ఇద్ద‌రినీ మెప్పించ‌గ‌ల‌ క‌థ‌ను ద‌ర్శ‌కులు త‌యారు చేసుకోవాలేగానీ..వారిద్ద‌రూ క‌లిసి న‌టించ‌డం అసాధ్యం ఏమీ కాద‌నే చెప్పాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: