తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో నిర్మాత‌గా డాక్ట‌ర్ ద‌గ్గుబాటి రామానాయుడి స్థానాన్ని అందుకోవ‌డం మ‌రెవ‌రికీ సాధ్యం కాదు. త‌న ముందు త‌రం నిర్మాత‌లు వేసిన బ‌ల‌మైన పునాదుల‌పై తెలుగు చిత్ర‌సీమ అనే అందాల సౌధాన్ని నిర్మించిన ఘ‌న‌త ఆయ‌న‌ది. అయితే ఆయ‌న విజ‌యాల గాథ టాలీవుడ్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాదు. ఆయ‌న స్థాపించిన సురేష్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌కు ఇక్క‌డ ఎంతటి పేరు ప్ర‌తిష్ఠ‌లున్నాయో బాలీవుడ్‌లోనూ అదే స్థాయి గౌర‌వం ఉంది. నిర్మించిన సినిమాల సంఖ్య తీసుకున్నా, విజ‌యాల శాతం చూసినా మ‌రే భార‌తీయ నిర్మాత కూడా ఇప్ప‌టిదాకా ఆయ‌న‌కు పోటీకి రాలేర‌నే చెప్పాలి. దేశంలోని 13 భాష‌ల్లో క‌లిపి 150కి పైగా చిత్రాలు నిర్మించి న రికార్డు ఆయ‌న‌ది. ఇన్ని చిత్రాలు తీసిన ప్రొడ్యూస‌ర్ ప్ర‌పంచంలోనే మ‌రొక‌రు లేరు. అందుకే గిన్నిస్ బుక్ ఆఫ్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్‌లో రామానాయుడు పేరు న‌మోదైంది. అందుకే బాలీవుడ్ వ‌ర్గాలు ఆయ‌న‌కు పెట్టిన పేరు మూవీ మొఘ‌ల్. ఇలా పిలిపించుకున్న నిర్మాత దేశంలోనే మ‌రొక‌రు లేరు. అదీ రామానాయుడంటే. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా ఆయ‌న‌ను వ‌రించింది. ఆయ‌న విజ‌యాల‌ను గౌర‌విస్తూ భార‌త ప్ర‌భుత్వం రామానాయుడిని ప‌ద్మ‌భూష‌ణ్ పుర‌స్కారంతో స‌త్క‌రించింది.

1936 జూన్ 18న ప్ర‌కాశం జిల్లాలో ఓ సంప‌న్న రైతు కుటుంబంలో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర్లు- ల‌క్ష్మీదేవ‌మ్మ దంప‌తుల‌కు రామానాయుడు జ‌న్మించారు. విద్యాభ్యాసం పూర్త‌యిన త‌రువాత మొద‌ట్లో రైస్ మిల్, ట్రాన్స్‌పోర్ట్ వ్యాపారాలు నిర్వ‌హించి ఆ తరువాత 1962లో మ‌ద్రాసులో అడుగుపెట్టి సినీ నిర్మాణం వైపు దృష్టి సారించారు. మొద‌ట్లో మ‌రో ఇద్ద‌రితో క‌లిసి అనురాగం అనే చిత్రాన్ని నిర్మించారు. అది వ్యాపార‌ప‌రంగా విజ‌య‌వంతం కాలేదు. ఆ త‌ర్వాత ఏడాది సొంతంగా సురేష్ ప్రొడ‌క్ష‌న్స్‌ను స్థాపించి ఎన్టీఆర్ హీరోగా 1964లో రాముడు భీముడు చిత్రాన్ని నిర్మించారు. అది ఘ‌న‌విజ‌యం సాధించింది. అయితే ఆ త‌ర్వాత కొన్ని ఫెయిల్యూర్స్ ఎదుర‌వ‌డంతో నిర్మాత‌గా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ స‌మ‌యంలో విజ‌యా ప్రొడ‌క్ష‌న్స్‌తో క‌లిసి అక్కినేని నాగేశ్వ‌ర‌రావు-వాణిశ్రీ జంట‌గా కె.ఎస్‌. ప్ర‌కాశ‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ప్రేమ‌న‌గ‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించారు. ఈ చిత్రం బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యం సాధించ‌డంతో ఆ త‌ర్వాత ఆయ‌న వెన‌క్కు తిరిగి చూడాల్సిన అవ‌స‌ర‌మే రాలేదు. ఇదే చిత్రాన్ని త‌మిళంలోనూ, హిందీలోనూ కూడా నిర్మించగా అక్క‌డా ఆ చిత్రం ఘ‌న‌విజ‌యం అందుకుని నిర్మాత‌గా ఆయ‌నను తిరుగులేని స్థానంలో నిల‌బెట్టింది. ఆ త‌ర్వాత తెలుగు, త‌మిళం, హిందీలో స్టార్ హీరోలతో ఆయ‌న చిత్రాలు నిర్మించారు. 1986లో ఆయ‌న త‌న‌యుడు వెంక‌టేష్ ను క‌లియుగ పాండ‌వులు చిత్రంతో హీరోగా టాలీవుడ్‌కు ప‌రిచ‌యం చేశారు. ఆ త‌ర్వాత వెంక‌టేష్ స్టార్ హీరోగా ఎదిగారు. మ‌రో త‌న‌యుడు సురేష్ ప్ర‌ముఖ నిర్మాత‌గా కొన‌సాగుతున్న విష‌యం తెలిసిందే. రామానాయుడు పేరే పెట్ట‌కున్న ఆయ‌న మ‌నుమ‌డు రానా సైతం ప‌లు భాష‌ల్లో న‌టిస్తూ పేరు తెచ్చుకోవ‌డం విశేషం.

మరింత సమాచారం తెలుసుకోండి: