సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత సినిమా పరిశ్రమలో ఒక పెద్ద మార్పు చోటు చేసుకుంది. ఇప్పుడు సినిమా విడుదలైన వెంటనే ఆ సినిమా గురించి ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని నిర్మొహమాటంగా సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్నారు. ఏ సినిమా అయినా ట్రైలర్ లేదా పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుంచే చర్చలకు దారి తీస్తుంది. సినిమా విడుదలైన రోజు నుంచే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఆ సినిమాకు సంబంధించిన రివ్యూలతో నిండిపోతాయి. ఈ పరిస్థితుల్లో ప్రతి సినిమా, ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు, ప్రేక్షకుల ముందుంచే కంటెంట్ పట్ల మరింత జాగ్రత్తగా ఉండాలి అన్న అవగాహన పెరుగుతోంది.


ఇటీవల విడుదలైన ‘మిరాయి’ సినిమా ఈ విషయాన్ని మరోసారి రుజువు చేసింది. సినిమా టైటిల్ నుంచే ఒక కొత్తదనం కనిపిస్తోంది. ప్రమోషన్లలో కూడా ఈ కొత్తదనం స్పష్టంగా కనిపించింది. దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని తన విజన్‌ను అద్భుతంగా తెరపై ఆవిష్కరించగా, హీరో తేజ తన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించిన ఈ సినిమాలో పూర్తిగా తనను తాను మలుచుకున్నాడు. తేజ ఇప్పటివరకు చాలా సినిమాల్లో నటించినా, ఇంత భిన్నమైన పాత్రలో కనిపించడం ఇదే మొదటిసారి. అందుకే ఆయన నటనకు ప్రేక్షకులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ‘మిరాయి’ సినిమా కాన్సెప్ట్ తెలుగు సినిమాల్లో ఇంతవరకు ఎవరూ తాకని ఒక విభిన్నమైన కథ.

 

సాధారణంగా మన హీరోలు ఎక్కువగా లవ్ స్టోరీస్, ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ ఎంటర్టైనర్స్ వైపు మొగ్గు చూపుతుంటారు. కానీ ‘మిరాయి’ మాత్రం పూర్తిగా వేరే దిశలో పయనించింది. ఈ సినిమాలో కళింగ యుద్ధం తర్వాత అశోకుడు తన జ్ఞానాన్ని తొమ్మిది గ్రంథాల రూపంలో సేకరించి, ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది మంది రక్షకులకు అందజేయడం అనే కాన్సెప్ట్‌ను కథలో ప్రాథమికంగా చూపించారు. ఆ తర్వాత ప్రస్తుత కాలానికి వస్తూ ఈ గ్రంథాలను సంపాదించడానికి జరిగే సంఘటనలు ప్రేక్షకుల్ని ఉత్కంఠభరితంగా ఉంచుతాయి. హీరో తేజ  ఈ యాత్రలో రామాయణ కాలానికి వెళ్లి రాముడి శక్తిని స్వీకరించి రక్షకుడిగా మారడం, ఆయన ఎదుర్కొనే సవాళ్లు, అవాంతరాలు అన్నీ అద్భుతంగా తెరకెక్కించబడ్డాయి.



‘మిరాయి’ సినిమా మొత్తం ఒక పౌరాణికత, చారిత్రక అంశాలు, ఫాంటసీని మేళవించి ప్రేక్షకులను కట్టిపడేసేలా రూపొందించబడింది. ముఖ్యంగా విజువల్స్, నేపథ్య సంగీతం, సాంకేతిక విలువలు అన్నీ హాలీవుడ్ స్థాయి అనిపించేలా ఉన్నాయి. కార్తీక్ ఘట్టమనేని తన దర్శకత్వ ప్రతిభను మరో స్థాయికి తీసుకెళ్లారు. ఈ సినిమాకి వచ్చిన పాజిటివ్ టాక్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమా చూసి "మన తెలుగు హీరోలు ఇలాంటివి నేర్చుకోవాలి" అంటూ కామెంట్లు చేస్తున్నారు. తరచూ "పాన్ ఇండియా స్టార్" అనే ట్యాగ్‌తో అదే తరహా సినిమాలు తీస్తూ ఉంటే ప్రేక్షకులు విసుగెత్తిపోతారని ఈ సినిమా మరోసారి రుజువు చేసింది. కంటెంట్ ఉన్న సినిమాలు మాత్రమే సక్సెస్ సాధిస్తాయని ‘మిరాయి’ చూపించింది.



చాలామంది సోషల్ మీడియా యూజర్లు కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ, “మన చరిత్రలో ఉన్న పౌరాణిక అంశాలను ఇలాంటివి సినిమాల ద్వారా కొత్త తరానికి పరిచయం చేస్తే చక్కగా ఉంటుంది” అని ప్రశంసిస్తున్నారు. కొంతమంది ప్రేక్షకులు సరదాగా పాన్ ఇండియా స్టార్లను ట్రోల్ చేస్తూ, "మంచి కథలపై దృష్టి పెట్టండి, కేవలం స్టార్ ఇమేజ్‌తో సినిమా హిట్ అవుతుందనే రోజులు పోయాయి" అని కామెంట్లు చేస్తున్నారు. ‘మిరాయ్’ సినిమా తెలుగు సినీ పరిశ్రమలో కొత్త తరం చిత్రాలకు దారితీసే మార్గదర్శక చిత్రం. ఇది కేవలం ఓ సినిమా కాదు, ఒక సాహసోపేతమైన ప్రయోగం. తేజ తన కెరీర్‌లో ఈ సినిమాతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోగా, కార్తీక్ ఘట్టమనేని తన దర్శకత్వ నైపుణ్యాన్ని మరోసారి నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: