ఇద్ద‌రు తెలుగు సీఎంల కల‌యిక ఒక వార్త‌కు ముగింపునిస్తే కొన్ని సంచ‌ల‌న వార్త‌లు తెర‌పైకి వ‌చ్చాయి. అందులో ప్ర‌త్యేకంగా చ‌ర్చించుకోవ‌ల‌సిన వాటిలో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం ఒక‌టి. ఇంత‌కీ కేసీఆర్ ఆహ్వానించ‌డానికి రేవంత్ రెడ్డి ఎందుకు హాజ‌రు కాలేద‌న్న వార్త తెలుగు రాష్ట్రాల్లో చ‌క్క‌ర్లు కొడుతుంది. వాస్త‌వానికి రేవంత్ రెడ్డి రావ‌ల‌సిన సంద‌ర్భ‌మే. కానీ ఆయ‌న హాజ‌రుకాక‌పోవ‌డంతో మ‌రికొన్ని అనుమానాల‌కు తావిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌విని  క‌ట్ట‌బెట్టి, ఇక ఆయ‌న‌ను అన్ని విష‌యాల్లో కొంచెం దూరంగా ఉంచాల‌ని చంద్ర‌బాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అందుకోస‌మే ఆయ‌న‌ను మిన‌హ‌యింపునిచ్చి ఇత‌ర నేత‌లైనా టీడీపీ తెలంగాణ అధ్య‌క్షుడు ఎల్. ర‌మ‌ణ‌, టీడీఎల్పీనేత ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావును వెంట‌బెట్టుకుని సీఎం కేసీఆర్ ఇంటికి వెళ్లార‌ని రాజ‌కీయ వ‌ర్గాలు భావిస్తున్నారు.


టీడీపీ ఫైర్  రేవంత్ రెడ్డి గుస్స


ఈ వ్య‌వ‌హారంపై ఇప్ప‌టికే టీడీపీ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి గుస్స మీద ఉన్న‌ట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత చంద్ర‌బాబు తీరుపై మండిప‌డుతున్నార‌ట‌. త‌న‌ను చంద్ర‌బాబు ను ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువుల నీరు తాగించిన తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంటికి చంద్రబాబు వెళ్లి ఆయ‌న్ను అమ‌రావ‌తి శంకుస్థాప‌నకు రావాల్సిందిగా ఆహ్వానించ‌డ‌మే కాకుండా ఇరువురు స్నేహ పూర్వ‌క వాతావ‌ర‌ణంలో సుమారుగా అర‌గంట పాటు గ‌డిపారు. ఇద్దరు చంద్రులు రాసుకొని పూసుకొని కనిపించ‌డంతో రేవంత్ రెడ్డి అగ్గిమీద గుగ్గిల‌మ‌వుతున్నార‌ట‌. ఇక‌పోతే ఈ వ్య‌వ‌హారం పై ప‌లు అనుమానాలు లేక‌పోలేదు. గ‌త కొన్ని నెల‌ల క్రితం ఓటుకు నోటు వ్య‌వ‌హారంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ తీవ్ర న‌ష్ట‌మే జరిగింది. ఈ కుంభ కోణంలో కీల‌క భూమిక పోషించిన రేవంత్ రెడ్డి అడ్డంగా బుక్కై, రెండు నెల‌ల పాటు జైలు జీవితం గ‌డ‌పాడు. ఈ వ్య‌వ‌హార‌మంతా వ్య‌క్తి ని ఉద్దేశించిది కాదని ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు.


కానీ.. రేవంత్ రెడ్డి మాత్రం ఈ వ్య‌వ‌హారంపై వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగారు. న‌న్ను కావాల‌నే సీఎం కేసీఆర్ ఈ వ్య‌వ‌హారంలో ఇరికించార‌ని  ఆరోపించారు. టీఆర్ఎస్ పార్టీపై, కేసీఆర్ పై తీవ్ర‌స్థాయిలోనే విరుచుకుప‌డ్డాడు రేవంత్ రెడ్డి. మీసాలు మెలేసి మ‌రీ నీ అంతుచూస్తా కేసీఆర్ అంటూ  సంచ‌ల‌న వ్యాఖ్యలే చేశారు. అప్ప‌ట్లో రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారి వేడెక్కాయి. దీంతో రేవంత్ రెడ్డిని వ్య‌వ‌హారానికి చెక్ పెట్టాల‌ని ఇటు టీఆర్ఎస్, టీడీపీ వ‌ర్గాలు కూడా భావిస్తున్న‌ట్లు తెలుస్తోంది. వాస్త‌వానికి పార్టీ వ్య‌వ‌హారం అయితే పెద్ద‌గా ఇబ్బంది ఉండేది కాదు. కానీ రేవంత్ రెడ్డి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు దిగ‌డ‌మే అయ‌న‌ను చాలా ఇబ్బందుల‌కు గురిచేస్తున్నాయి. అప్ప‌ట్లో నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌వితకు రెండు ప్రాంతాల్లో ఓటు హ‌క్కు ఉంద‌ని అన‌వ‌స‌ర‌పు ఆరోప‌ణ‌లు చేసి పప్పులో కాలేశారు. అంతేకాకుండా కేసీఆర్ పై చాలా సంద‌ర్భాలలో తీవ్రంగానే ఆరోప‌ణ‌లు చేశాడు రేవంత్. 


ఇలా రేవంత్ వ్య‌వ‌హారం కాస్తా ఆయ‌న‌కే కాకుండా, ఆ పార్టీ నేత చంద్ర‌బాబును కూడా తీవ్ర ఇబ్బంది పెడుతున్నాయని తాజాగా ఆ పార్టీ వ‌ర్గాలు గుస గుసు లాడుకుంటుంన్నారు. ఇక రేవంత్ వ్య‌వ‌హారానికి అడ్డుక‌ట్ట వేయ‌కుంటే చాలా ప్ర‌మాదమేన‌ని భావించిన చంద్ర‌బాబు ఆయ‌న‌ను పార్టీ వ్య‌వహారాల్లో ప‌రిమితం చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఇందుకు గానూ ఆంద్ర‌ప్ర‌దేశ్ రాజ‌దాని అమ‌రావ‌తి శంకుస్థాప‌న‌కు ఆహ్వానించ‌డానికి చంద్ర‌బాబు రేవంత్ ను ప‌క్క‌న‌బెట్టి ఎల్ ర‌మ‌ణ‌, ఎర్రబెల్లిని వెంట‌బెట్టుకుని వెళ్లార‌ని తెలుస్తోంది. బాబు ను రాకను గ‌మ‌నించిన తెలంగాణ సీఎం కేసీఆర్, ఆయ‌న త‌నయుడు మంత్రి కేటీఆర్ లు ఎదురెల్లి పుష్ప‌గుచ్ఛాన్ని ఇచ్చి మ‌రీ సాద‌రంగా ఆహ్వానించారు. అంతేకాకుండా చంద్ర‌బాబు తిరుప‌తి నుంచి తీసుకువ‌చ్చిన ల‌డ్డుల‌ను బ‌హుక‌రించి, శాలువ‌తో కేసీఆర్ ను స‌త్క‌రించారు. అనంత‌రం ఇరువురు దాదాపుగా అర‌గంట పాటు చ‌ర్చించుకున్నారు.   


ఈ భేటీ ఇరు పార్టీల‌కు కీల‌క‌మైనదే కావ‌డంతో ఈ వ్య‌వ‌హారంలో టీడీపీ పార్టీ ఫైర్ బ్రాండ్ లేక‌పోవ‌డమే కాకుండా త‌న‌ను జైల్లో పెట్టించిన కేసీఆర్ తో సానిహిత్యం పెంచుకోవ‌డం తో రేవంత్ కు మింగుడు ప‌డ‌టంలేదు. అయితే తెలంగాణ సీఎం కు ఆహ్వానం ఎందుకు ఇవ్వాల్సి వ‌చ్చిందో ఏపీ సీఎం చంద్ర‌బాబు వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. ప్ర‌భుత్వాలు, ప్రాంతాలు వేరైనా తెలుగు ప్రాంతం వాళ్లం, స‌మ‌స్య‌లు వ‌స్తుంటాయ‌ని, పోతుంటాయని వాటిని సామ‌రస్యంగా ప‌రిష్క‌రించుకోవాల‌ని, విభ‌జ‌నతో చాలా న‌ష్టం పోయామ‌ని, ఇప్పుడు విభేదాలు చూపుకుంటూ ముందుకుపోతుంటే ఇరు రాష్ట్రాలకు నష్ట‌మే. సానుకూల వాతావ‌ర‌ణంలోకి ఇరు రాష్ట్రాలు ముందుకుపోవాల‌నే నా కోరిక‌. ఇందుకోస‌మే కేసీఆర్ ను శంకుస్థాప‌న‌కు ఆహ్వానిస్తున్నాన‌ని ఏపీ సీఎం తెలిపారు. ఏది ఏమైనా.. ఇరు రాష్ట్రాల‌కు ఇది మంచి ప‌రిణామ‌మనే చెప్పాలి. ఇది ఇలా ఉంటే రేవంత్ రెడ్డి వ్య‌వ‌హారం భిన్నంగా ఉంది. త‌నను జైలులో వేసిన కేసీఆర్ ను ఆహ్వానించ‌డం పై ఆయ‌న మండిప‌డుతున్నారు. 


ఇరు రాష్ట్రాలు క‌లిసి అభివృద్ధి కోసం తెలుగు ముఖ్య‌మంత్రులు పాటుప‌డుతుంటే.. రేవంత్ త‌న వ్య‌క్తి గ‌తంగా టీఆర్ఎస్ క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల‌కు పాలుప‌డుతున్నారని అభిప్రాయం ఉంది. దీంతో చంద్ర‌బాబు రేవంత్ రెడ్డి విష‌యంలో కొంత ఆచితూచి అడుగులు వేయాల‌ని యోచిస్తున్న‌ట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి వ్య‌క్తిగ‌త దూష‌ణ‌ల‌కు వెళ్తున్నార‌ని అప్ప‌ట్లో టీడీపీ అధిష్టానం సైతం అంత‌ర్గ‌తంగా చ‌ర్చించుకుంది. ఇక  రేవంత్ రెడ్డి దూకుడు కు అడ్డుక‌ట్ట వేయ‌క‌పోతే పార్టీకి మ‌రింత న‌ష్టం వాటిల్లే ప్ర‌మాదం ఉందని భావించిన‌ చంద్ర‌బాబు, ఇక రేవంత్ రెడ్డి కొన్నింటిలో దూరంగానే ఉంచాల‌ని భావిస్తున్న‌టు తెలుస్తోంది. మ‌రోవైపు ఓటుకు నోటు వ్య‌వ‌హారం కూడా దాదాపుగా క‌నుమ‌రుగ‌య్యింది. ఈ నేప‌థ్యంలో టీడీపీ అధిష్టానం రేవంత్ రెడ్డి దూకుడు చ‌ర‌మ‌గీతం పాడే అవ‌కాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయ‌న్ని స‌మాచారం.



మరింత సమాచారం తెలుసుకోండి: