టిడిపి అధినేత చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విచారణ తిరిగి ప్రారంభం కానుంది. గతంలో చంద్రబాబుపైన ఏసిబి కోర్టులో నమోదైన కేసులో ఆయన హైకోర్టును ఆశ్రయించగా..హైకోర్టు స్టే ఇచ్చింది. తాజాగా సుప్రీం మార్గదర్శకాల మేరకు ఆరు నెలల స్టే సమయం దాటిని కేసుల్లో స్టే వెకేట్ అవుతుంది. దీంతో..ఇప్పుడు ఈ కేసులో తిరిగి విచారణ ప్రారంభమైంది.

చంద్రబాబుపై విచారణ మొదలు..ఏపి ముఖ్యమంత్రి..టిడిపి అధినేత చంద్రబాబుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు కొత్త టర్న్ తీసుకుంది. 2005లో లక్ష్మీ పార్వతి చంద్రబాబు ఆస్తుల పైన విచారణ జరపాలని ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ కేసులో చంద్రబాబు హైకోర్టులో స్టే తెచ్చుకున్నారు.
అయితే, కొద్ది రోజుల క్రితం సుప్రీం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు స్టేను వెకేట్ చేసారు. దేశ వ్యాప్తంగా ఆరు నెలలకు మించి ఏ కేసులోనూ స్టే ఉండకూడదని సుప్రీం స్పష్టం చేసింది. దీంతో.. ఈ కేసును తిరిగి విచారించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఈ కేసుకు సంబంధించి కోర్టుకు హాజరుకావాలని లక్ష్మీపార్వతికి సమన్లు జారీ అయ్యాయి. దీంతో ఆమె కోర్టుకు హాజరయ్యారు. కేసు స్టేటస్‌పై వచ్చేనెల 13న హైదరాబాద్‌ ఏసీబీ కోర్టు విచారణ చేపట్టనుంది.


మిగిలిన కేసుల్లోనూ ఇదే జరుగుతుందా..చంద్రబాబు పైన నమోదైన కేసుల్లో స్టేల కారణంగా విచారణ జరగలేదని రాజకీయంగా అనేక సార్లు ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇప్పుడు సుప్రీం ఆదేశాల మేరకు స్టేలు తొలిగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక, ప్రస్తుత కేసును 2005 లో లక్ష్మీపార్వతి ఈ కేసు దాఖలు చేయగా హైకోర్టు నుంచి చంద్రబాబు నాయుడు స్టే తెచ్చుకున్నారు.దానిని వెకేట్ చేయించడానికి తాము ప్రయత్నించినా సాద్యం కాలేదని లక్ష్మీపార్వతి చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఎన్నికల అఫిడవిట్ లలో ప్రతిసారి బిన్నమైన ఆస్తులు చూపించారని, చంద్రబాబు తల్లికి హైదరాబాద్ లో ఐదు ఎకరాల భూమి ఎలా సంపాదించిందని కూడా తాము ప్రశ్నించామని ఆమె చెప్పారు. చంద్రబాబు అంత అవినీతి పరుడు దేశంలోనే లేరని, అందుకే తాము ఆయనపై పోరాడుతున్నామన్నామన్నారు.


రాజకీయంగా చర్చకు అవకాశం..ఏపిలో ఎన్నికలు ముగిసినా ఇప్పుడు చంద్రబాబు పైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు విచారణ ప్రారంభమైతే ఇది రాజకీయంగానూ చర్చకు దారి తీసే అవకాశం ఉంది. వైసిపి అధినేత జగన్ పైనా..ప్రధాని మోదీ పైన టిడిపి నేతలు అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఏపి ముఖ్యమంత్రిగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని వైసిపి..బిజెపితో పాటుగా పవన్ కళ్యాన్ సైతం ఆరోపించారు. ఇక, ఇప్పుడు ఈ కేసు విచారణ ప్రారంభమైతే చంద్రబాబు వ్యతిరేక పార్టీలకు మరో అస్త్రం దొరికినట్లుగానే భావించాలి. ఇదే సమయంలో..చంద్రబాబు పైన పెండింగ్‌లో ఉన్న కేసులను విచారిస్తారని వైసిపి నేతలు చెబుతున్నారు.


కొల్లూరు శ్రీనివాసు శర్మ 
9912341507


మరింత సమాచారం తెలుసుకోండి: