తిరుమలలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించారు. మొదట శ్రీవారి ఆలయం ముందు ఉన్న బేడి ఆంజనేయ స్వామి గుడి దగ్గరకు సీఎం చేరుకున్నారు.ఆలయ మహాద్వారం ద్వారా  జగన్ ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ ఉన్న ఆలయ అర్చకులు సీఎం జగన్ కు పరివట్టం చుట్టారు. ఆ తరువాత  జగన్ పట్టు వస్త్రాలను ఉంచిన వెండి పళ్లేన్ని తలపై ఉంచుకున్నారు. 
 
మంగళవాయిద్యాల నడుమ సీఎం జగన్ ఊరేగింపుగా శ్రీవారి ఆలయంలోకి ప్రవేశించారు. గతంలో సీఎం హోదాలో వైయస్ రాజశేఖర్ రెడ్డి అనేక పర్యాయాలు శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి సీఎం హోదాలో శ్రీవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. ఈరోజు స్వామివారు పెద్దశేష వాహనంపై దర్శనమివ్వనున్నారు. అర్చకులు సీఎం జగన్ కు ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందించారు. 
 
 
తిరుమలకు ఈరోజు లక్షల సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ధ్వజారోహణం కార్యక్రమంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. భక్తులు బ్రహ్మాండనాయకుడి వేడుకను కనులారా తిలకిస్తున్నారు. తిరుగిరులన్నీ ఈరోజు గోవిందుని నామస్మరణతో మారుమ్రోగుతున్నాయి. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పెద్దశేష వాహన సేవలో పాల్గొననున్నారు. ఈరోజు రాత్రి సీఎం జగన్ తిరుమలలోనే బస చేయనున్నారు. రేపు ఉదయం సీఎం జగన్ రేణిగుంట విమానశ్రయానికి చేరుకుని అక్కడినుండి విజయవాడకు వెళుతున్నారని సమాచారం అందుతుంది. 
 
ఈ కార్యక్రమంలో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, పంచాయతీరాజ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుమల ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఒకే కుటుంబంలో తండ్రి, తనయుడు సీఎం హోదాలో పట్టువస్త్రాలు సమర్పించిన అరుదైన గౌరవం వైయస్సార్ కుటుంబానికి దక్కింది. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: