గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.  అన్ని రాజకీయ పార్టీల  నోట ఒకటికి పదిమార్లు మార్మోగుతున్నారు  ఇపుడు. ఆయన ఉంటున్న రాజ్ భవన్ వైపు ఇపుడు అందరి చూపు పడింది. గవర్నర్ తీసుకునే నిర్ణయం మీదనే అందరికీ టెన్షన్ గా ఉంది. ఒక విషయంలో కాదు రెండు విషయాల్లో గవర్నర్ కీలకమైన నిర్ణయాలు తీసుకోనున్నారు. ఆ రెండూ కూడా అటు వైసీపీకి, ఇటు విపక్షాలకు కూడా అత్యంగ ప్రతిష్టాత్మకమైనవి కావడం విశేషం.

 

అందులో మొదటిది తీసుకుంటే మూడు రాజధానుల బిల్లులను  గవర్నర్ కి వైసీపీ సర్కార్ పంపించింది. ఆ బిల్లులను  ఆయన పరిశీలించి ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఆసక్తి ఉంది. ఇప్పటికే ఆరు నెలలుగా ఇదే అంశం మీద అటు జగన్ సర్కార్ తో ఇటు టీడీపీ, ఇతర పార్టీలు పోరాడుతున్నాయి. రెండు సార్లు శాసనమండలిలో అడ్డుకున్నారు. కానీ ఇపుడు మాత్రం గవర్నర్ వద్దకు ఈ బిల్లులు చేరాయి. 

 

వీటి విషయంలో గవర్నర్ అసలు ఆమోదించవద్దని, ఎందుకంటే ఈ బిల్లులు మండలిలో సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉందని టీడీపీ నేతలు చెబుతున్నారు. అదే విధంగా  కోర్టులో కూడా ఈ కేసు ఉందని అంటున్నారు. మరి దీని మీద గవర్నర్ న్యాయ సలహాలు తీసుకుంటారా అన్నది చూడాలి. 

 

అదే విధంగా చూసుకుంటే మరో వైపు ఎన్నికల మాజీ కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయం కూడా గవర్నరే తేల్చాల్సి ఉంది. నిమ్మగడ్డను రీ అపాయింట్ చేసే అధికారం గవర్నర్ కే ఉందని, ఆయన్ని కలవాలని హైకోర్టు ఆదేశించింది. దాంతో నిమ్మ‌గడ్డ మూడు రోజుల క్రితం అపాయింటెమెంట్ కోరగా రేపు గవర్నర్ అవకాశం ఇచ్చారు. 

 

ఇది కూడా మరో సక్లిష్టమైన అంశమే. ఎందుకంటే వైసీపీ సర్కార్ తెచ్చిన పంచాయతీరాజ్ సంస్కరణలను గవర్నర్ ఆమోదించారు. ఆ తరువాతనే నిమ్మగడ్డ పదవి కోల్పోయారు. ఇపుడు ఆయన నిమ్మగడ్డను మళ్ళీ నియమిస్తే తాను ఆమోద ముద్ర వేసిన పంచాయతీ రాజ్ చట్ట సంస్కరణలు తప్పు అని తానే ఒప్పుకున్న్నట్లు అవుతుంది. మరో వైపు అసలు రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నికల సంఘం కమినర్లను నియమించే అవకాశం, అధికారం ఉందా లేదా అన్న దానిపైన సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది.  దాంతో నిమ్మగడ్డ విషయంలో గవర్నర్ ఏం చెప్తారు అన్నది మరో చర్చ. 

 

మొత్తానికి ఏడాది క్రితం అధికారంలోకి వచ్చిన గవర్నర్ కి ఇపుడు అసలైన రాజ్యాంగ సవాళ్ళు ఎదురవుతున్నాయి. ఆయన  ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారు అన్నది పక్కన పెడితే ఆయన తీసుకునే నిర్ణయాలు మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో పెను ప్రభావం చూపిస్తాయని అంటున్నారు. చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: