హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా 3 జలాశయాల నిర్మాణానికి సీఎం జగన్ శంకుస్థాపన చేశారు. వీటికి డాక్టర్‌ వైయస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టుగా నామకరణం చేశారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌ పద్ధతిలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు సీఎం.

అనంతపురం జిల్లాలో మూడు ప్రాజెక్టుల నిర్మాణానికి పునాది రాయి వేశారు సీఎం జగన్‌. హంద్రీనీవా సుజల స్రవంతి పథకంలో భాగంగా 3 జలాశయాల నిర్మాణ పనులకు సీఎం వైఎస్ జగన్ శంఖుస్థాన చేశారు. ఈ కార్యక్రమంలో అనంతపురంజిల్లా లోని చెన్నేకొత్తపల్లి మండలం వెంకటాంపల్లిలో  పైలాన్ వద్ద నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి బొత్స సత్యనారాయణ, మంత్రులు సీదిరి అప్పలరాజు, మాలగుండ్ల శంకర నారాయణ, ఎంపీ మాధవ్, ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి,  ఇతర నేతలు పాల్గొన్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి ద్వారా రాయలసీమలో దాదాపు 6.025 లక్షల ఎకరాలకు సాగునీరు, సుమారు 33లక్షల మందికి తాగునీరు అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం.

ఈ వైయస్సార్‌ అప్పర్‌ పెన్నార్‌ ప్రాజెక్టులో ఎగువ పెన్నా జలాశయం ద్వారా 10 వేల ఎకరాలు, ముట్టాల జలాశయం ద్వారా 18,700 ఎకరాలు, తోపుదుర్తి జలాశయం ద్వారా 18 వేల ఎకరాలు, దేవరకొండ జలాశయం ద్వారా 19,500 ఎకరాలు, సోమరవాండ్లపల్లి జలాశయం ద్వారా 8,800 ఎకరాలకు నీరు అందుతుంది.

ఈ ప్రాజెక్ట్‌ కోసం 5,171 ఎకరాల భూమి సేకరించాల్సి ఉంది. ప్రాజెక్ట్‌ పనుల్లో భాగంగా జీడిపల్లి జలాశయం నుంచి ఎగువ పెన్నా జలాశయం వరకు 53.45 కి.మీ. ప్రధాన కాలువ, అందులో భాగంగా 4 ఎత్తిపోతల పథకాలు, 110 కాంక్రీట్‌ కట్టడాల నిర్మాణం జరుగుతుందని సీఎం జగన్ వెల్లడించారు.అంతేకాకుండా కొత్తపల్లి, ఆత్మకూరు, బాల వెంకటాపురం, మద్దలచెరువు వద్ద నాలుగు ఎత్తిపోతల పథకాలు రాబోతున్నాయని తెలిపారు.

అదనంగా మరో రెండు రిజర్వాయర్లు కలపడం ద్వారా అదనంగా మరో 3.3 టిఎంసీల కెపాసిటీని కలిపినట్లు అయ్యిందని.. అయితే ప్రాజెక్ట్‌ను అదే వ్యయం రూ.803 కోట్లతోనే చేయగలుగుతున్నామని సీఎం వివరించారు. దీనిని బట్టి గత ప్రభుత్వం లంచాలు తీసుకుని, ఏ స్థాయిలో ప్రాజెక్ట్ లను గాలికి వదిలేశారనేది అందరికీ కూడా ఇట్టే అర్థమవుతోందని విమర్శించారు.

ఈ పథకం ద్వారా 90 రోజులలో 5 జలాశయాలలో 7.216 టీఎంసిల నీరు నింపి, బెలుగుప్ప, కూడేరు, ఆత్మకూరు, కంబదూరు, కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రాప్తాడు, రామగిరి మండలాల్లో 75 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తారు














మరింత సమాచారం తెలుసుకోండి: