కశ్మీర్: జమ్మూకశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కలిగించే ఆర్టికల్ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడి స్థానిక రాజకీయ నేతలు మాత్రం ఇప్పటికీ దాన్నే సాకుగా చూపి ప్రజలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జమ్మూ కశ్మీర్ లో కీలక నేతలైన ఫరూఖ్ అబ్దుల్లా, మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫరూఖ్ మాట్లాడుతూ.. ఆర్టికల్ 370 పునరుద్ధరణ కోసం చైనా సాయం తీసుకుంటామని అన్నారు. దీంతో అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది. ఫరూఖ్‌ను ‘చైనీస్ ఏజెంట్’ అంటూ నెటిజన్లు దుమ్మెత్తి పోశారు.

ఆ తర్వాత ముఫ్తీ మాట్లాడుతూ కూడా ఇలాంటి కామెంట్లే చేసింది. ఆర్టికల్ 370 పునరుద్ధరణ విషయంలో పాకిస్తాన్ సాయం తీసుకుంటామని ఆమె హింట్ ఇచ్చారు. వీరి వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాగూర్ ఘాటుగా స్పందించారు. ‘ఎవరెన్ని చెప్పినా, ఏం చేసినా ఆర్టికల్ 370 గతమే. ఈ చట్టం మళ్లీ అమల్లోకి రావడం జరగదు’ అని ఆయన తేల్చి చెప్పారు.

‘‘ఆర్టికల్ 370 గురించి చాలా మంది మాట్లాడుతున్నారు. ఫరూఖ్ అబ్దుల్లా మాట్లాడుతూ చైనా సాయం తీసుకొని ఈ చట్టం పురుద్ధరిస్తా అంటారు. మెహబూబా ముఫ్తీ ఏమో మనకు ఉగ్రవాదం తప్పితే ఎటువంటి సాయమూ చేయని పాకిస్తాన్ సాయం తీసుకుంటాను, ఆర్టికల్ 370 మళ్లీ తెస్తాను అంటారు. ఎలాగైనా సరే ఆర్టికల్ 370 పునరుద్ధరిస్తాం అని వాళ్లు చెప్తున్నారు. వారి లక్ష్యం అదే అయితే నేనేం చేయలేను. కానీ నేను చెప్పేదొక్కటే.. ఈ చట్టం గతం, జరిగిపోయింది. దీన్ని మళ్లీ తిరిగి అమల్లోకి తీసుకు రావడం అనేది కల్ల’’ అని అనురాగ్ స్పష్టం చేశారు. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370ని రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ రాష్ట్రాన్ని జమ్మూ, లద్దాఖ్ గా విడగొట్టిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: