తెలంగాణ రాష్ట్ర సీఎం కేసీఆర్ మంగళవారం కాళేశ్వరం ప్రాజెక్టులో పర్యటించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆ ప్రాజెక్ట్ సందర్శనకు ముందు కాళేశ్వ‌రం శ్రీ ముక్తేశ్వ‌ర‌ స్వామివారిని సతీ సమేతంగా ఆయన ద‌ర్శించుకుని, ప్ర‌త్యేక పూజలు నిర్వహించారు. స్వయంగా కేసీఆర్ దంపతులు స్వామివారికి అభిషేకం చేశారు. అనంతరం ప్రాజెక్టును పరిశీలించి మధ్యాహ్నం భోజనం అక్కడే చేసి తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ చేసిన ఈ పర్యటనపై ప్రతిపక్షాలు సంచలన ఆరోపణలు చేస్తున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటనపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.



నిన్న అకస్మాత్తుగా శ్రీమతిని తీసుకొని సీఎం కేసీఆర్ కాళేశ్వరం వెళ్లారని అన్నారు. తన కల సాకారం అయింది అని కేసీఆర్ కాళేశ్వరం పోయారట అంటూ బండి సంజయ్  ఎద్దేవా చేశారు. మూడు రోజులుగా ఆయన తన ఫార్మ్ హౌస్ లో దోష నివారణ పూజలు చేశారన్నారు. వాటిని కలపడానికి మాత్రమే కాళేశ్వరం వెళ్ళాడు. దానికి ప్రధాన కారణం... తన కొడుకును సీఎం చేయడమే, అందుకే కాళేశ్వరం వెళ్ళారు అంటూ ఆరోపించారు. కేసీఆర్ తన స్వార్థం కోసమే యాగాలు, పూజలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ప్రజలకు అన్ని తెలుసు.. అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళాడు అనే అనుమానం అందరికి వచ్చిందన్నారు బండి సంజయ్. నటించడం, అబద్ధాలు చెప్పడం,మోసం చేయడం లో కేసీఆర్ దిట్ట అంటూ మండి పడ్డారు. మరోవైపు సొంత పార్టీ నేతలు సైతం కేటీఆర్ త్వరలో సీఎం అవుతారని సంకేతాలు ఇస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇదే మాట చెబుతున్నారు. ఇక వచ్చేనెల ఫిబ్రవరిలోనే కేటీఆర్ సీఎం అవ్వడం ఖాయమని జోస్యం చెబుతున్నారు. అంతేకాదు ప్రమాణ స్వీకారం తేదీ కూడా ఖరారు చేస్తున్నారు. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలు.. సీఎం అవ్వడానికి కేటీఆర్ సమర్థుడంటూ మద్దతు కూడా ఇస్తున్నారు. అలాంటి సందర్భంలో బీజేపీ నేత బండి సంజయ్ కేసీఆర్‌పై చేస్తున్న ఆరోపణలు రాష్ట్రంలో ఆసక్తికర చర్చలకు తెరతీసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: