తెలంగాణలో రాజకీయ కాక రేపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిశాయి. గతంలో ఎప్పుడు లేనంతగా పార్టీలు హోరాహోరీగా పోరాడాయి.దీంతో గతంలో కంటే పోలింగ్ శాతం పెరిగింది.
హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ స్థానంలో గతంలో కేవలం 36 శాతం పోలింగ్ మాత్రమే జరగగా.. ఈసారి 45 శాతం వరకు అయినట్లు తెలుస్తోంది. నల్గొండ-వరంగల్-ఖమ్మం స్థానంలో దాదాపు 50 శాతం పోలింగ్ నమోదైంది.

 అయితే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైన కొన్ని నిమిషాలకే.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. కొన్ని నిమిషాల్లోనే వైరల్ గా మాారాయి. పోలింగ్ పైనా కేటీఆర్ కామెంట్ల ప్రభావం కనిపించిందనే చర్చ జరుగుతోంది. షేక్‌పేట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్‌.. ఓ మహానుభావుడు చెప్పినట్లు.. ఇంట్లో గ్యాస్ సిలిండర్‌కు మొక్కి ఓటేసేందుకు బయలుదేరా అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రధాని నరేంద్ర మోడీని ఉద్దేశించి చేసినవిగా పలువురు అంటున్నారు. 2013లో సాధారణ ఎన్నికల సందర్భంగా మోదీ ... ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలను దృష్టిలో పెట్టుకుని... ఆనాటి యూపీఏ సర్కార్‌కు కౌంటర్‌గా.. సిలిండర్‌కు ఇంట్లో మొక్కి వస్తున్నానంటూ వ్యాఖ్యానించారు. తాజాగా కేటీఆర్ ఆ మాటలనే బీజేపీపై వ్యంగ్యాస్త్రంగా సంధించారు. కేటీఆర్ వ్యాఖ్యలను స్ఫూర్తిగా తీసుకున్న పలువురు... తమ ఇళ్లలో గ్యాస్ సిలిండర్లకు పూజలు చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఆ ఫొటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

మంత్రి కేటీఆర్ గ్యాస్ సిలిండర్ వ్యాఖ్యలు వైరల్ గా మారడంతో బీజేపీలో కలవరం రేగింది. అందుకే వెంటనే కౌంటర్లు ఇచ్చారు బీజేపీ నేతలు.  తాను ఓయూ నిరుద్యోగి ఎల్లస్వామికి దండం పెట్టుకుని వచ్చానని చెప్పారు హైదరాబాద్ బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచంద్రరావు. కేటీఆర్ గ్యాస్ సిలిండర్ కు దండం పెట్టడం కాదు..  భైంసాలో జరిగిన అల్లర్లలో గాయపడిన హిందువులకు దండం పెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ అన్నారు. ఇతర బీజేపీ నేతలు కూడా కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తూ ప్రకటనలు చేశారు. బీజేపీ నేతల రియాక్షన్లు చూస్తేనే కేటీఆర్ ప్రకటన ఎంతగా వాళ్లను ప్రభావితం చేసిందో చెప్పవచ్చంటున్నారు రాజకీయ అనలిస్టులు.

మరింత సమాచారం తెలుసుకోండి: