తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం ప్లవ నామ సంవత్సరం సందర్భంగా తెలంగాణా సిఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. నీరు సమృద్ధిగా ప్రవహించడం ఈ సంవత్సర ప్రాధాన్యతగా పంచాంగాలు చెప్తున్నాయని ఈ నేపథ్యంలో.. తెలంగాణ వ్యవసాయానికి సాగునీరు మరింత సమృద్ధిగా లభించనుందని ఆయన ఆకాంక్షించారు. ప్రభుత్వ లక్ష్యానికి ప్రకృతి కూడా తోడు కావడం శుభసూచకమని హర్షం వ్యక్తం చేసారు. వ్యవసాయ ప్రారంభ సంవత్సరంగా, రైతు పండుగగా ఉగాది ప్రసిద్ధిగాంచిందని ఆయన వెల్లడించారు.

ఆకులు రాల్చిన ప్రకృతి కొత్త చిగురులతో వసంతాన్ని మోసుకొస్తూ, నూతనోత్తేజాన్ని సంతరించుకుంటూ పక్షుల కిలకిలా రావాలతో ఆహ్లాదకరమైన కొత్త జీవితానికి ఉగాది ఆహ్వానం పలుకుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయానికి ముందస్తు ఏర్పాట్లను ఉగాది నుంచే రైతు ప్రారంభిస్తారని,  రైతును  వ్యవసాయానికి సంసిద్ధం చేసే ఉగాది  రైతు జీవితంలో భాగమై పోయిందని ఆయన అన్నారు. ప్రతి ఏటా చైత్రమాసంతో ప్రారంభమయ్యే ఉగాది పండుగ నాడు పచ్చడిని సేవించడం గొప్ప ఆచారమని తెలిపారు.

అప్పుడప్పుడే చిగురించే వేపపూతను, మామిడి కాతను, చేతికందే చింతపండులాంటి ప్రకృతి ఫలాలను  తీపి, వగరు చేదు రుచుల పచ్చడి సేవించి పండుగను జరుపుకోవడం గొప్ప సందేశాన్నిస్తున్నదని సిఎం వెల్లడించారు. మనిషి జీవితంలోని కష్ట సుఖాలు, మంచి చెడుల వంటి జీవిత సారాన్ని తాత్వికంగా గుర్తుచేసుకునే గొప్ప సజీవ సాంప్రదాయానికి చిహ్నంగా ఉగాది పచ్చడిని సేవిస్తారని చెప్పుకొచ్చారు. ఉమ్మడి పాలనలోని చేదు అనుభవాలను చవి చూసిన తెలంగాణ రైతు, స్వయంపాలనలో తియ్యటి ఫలాలను అనుభవిస్తున్నారని ఆయన అన్నారు.  

బ్యారేజీలు కట్టి, సొరంగాలు తవ్వి, లిఫ్టుల ద్వారా నీటిని ఎత్తిపోసి.. నదీజలాలను సాగరమట్టానికి ఎత్తుమీద వున్న సాగు బీల్లకు మళ్లించామని సిఎం తెలిపారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిని చేస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టు అనేక ప్రశంసలను అందుకుంటున్నదని సిఎం అన్నారు. మండే వేసవిలోనూ చెరువులను నిండుకుండలుగా మార్చి, రైతులకు పసిడి పంటలను అందిస్తున్నదని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: