కరోనా మహమ్మారి రెండో దశలో అనేక మందిని పొట్టన పెట్టుకుంటోంది. కరోనా మొదటి దశలో కరోనా రోగి మృతి చెందే దశకు చేరేందుకు చాలా సమయం తీసుకునేది.. కానీ.. ఇప్పుడు అలా కాదు.. కరోనా వచ్చిన నాలుగైదు రోజుల్లోనే వ్యాధి తీవ్ర దశకు చేరుతోంది. కుటుంబ సభ్యులు చూస్తుండగానే ప్రాణాలు వదులు తున్నారు. ఇటీవల ఒడిశాలో ఓ రోగి భార్య ఒడిలోనే కన్నుమూశాడు.

ఇప్పుడు తెలంగాణలోనూ అలాంటి ఘటనే జరిగింది. నిజామాబాద్‌ జిల్లాలో కరోనా పరీక్షల కోసం ఆసుపత్రికి వచ్చిన ఓ వ్యక్తి అక్కడే మృతి చెందాడు. ఈ విషాద సంఘట జిల్లాలోని రెంజల్‌ మండలంలో చోటు చేసుకుంది. బొర్గం గ్రామానికి చెందిన 30 ఏళ్ల అశోక్ అనే వ్యక్తికి కొన్ని రోజులుగా  కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో అనుమానం తీర్చుకునేందుకు భార్య లక్ష్మి, తల్లి గంగమని, తమ్ముడు గంగాధర్ తో కలసి సొంత ఆటోలో రెంజల్ పీహెచ్‌సీకి వచ్చాడు.

అక్కడ లో కరోనా టెస్టులు చేసుకున్నాడు. కరోనా నెగిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. హమ్మయ్య ఇక పర్వాలేదు.. ఏదో సాధారణ దగ్గు, జలుబు అయి ఉంటుందని కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే పరీక్ష చేయించుకున్న కొద్దిసేపటికే బాగా నీరసంగా ఉందని అశోక్‌ ఓ చెట్టుకు ఆనుకుని కూర్చున్నాడు. నిమిషాల వ్యవధిలోనే చెట్టు కింద కూర్చున్న చోటే మృతి చెందాడు. చెట్టుకు ఆనుకుని ఉన్న అశోక్‌ మృతదేహాన్ని పట్టుకుని కుటుంబ సభ్యులు విలపిస్తున్న దృశ్యం అందరినీ కదిలించింది. అశోక్ మృత దేహానికి బొర్గం గ్రామంలో ట్రాక్టర్ సహాయంతో కోవిడ్ నిబంధన మేరకు అంత్యక్రియలు పూర్తి చేశారు.

అందుకే .. కరోనా అనుమానిత లక్షణాలు ఉంటే.. వెంటనే పరీక్ష చేయించుకోండి.. కిట్లు లేవనో.. పరీక్షలు చేయలేదనో ఆలస్యం వద్దు. లక్షణాలు కనిపిస్తే రిపోర్టుతో పని లేకుండా చికిత్స తీసుకోవడం మంచిది.  తస్మాత్ జాగ్రత్త.. నిర్లక్ష్యం అస్సలొద్దు.


మరింత సమాచారం తెలుసుకోండి: