టీటీడీ ఢిల్లీ స్థానిక సలహా మండలి చైర్ పర్సన్ గా బాధ్యతలు స్వీకరించారు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి. వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజల అనంతరం బాధ్యతలను ఆమె స్వీకరించారు. అనంతరం ఆలయంలో గోపూజ నిర్వహించిన ప్రశాంతి రెడ్డి, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి... మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేసారు. ఉత్తరాది రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆలయాల విస్తరణ, సేవల విస్తరణ కోసం ఢిల్లీ లోకల్ అడ్వైజరీ కమిటీ పనిచేస్తుంది అని స్పష్టం చేసారు. ఉత్తరాదిన ఢిల్లీ, కురుక్షేత్ర సహా మరికొన్ని ప్రాంతాల్లో టీటీడీ ఆలయాలున్నాయి అని ఆయన వివరించారు.

జమ్మూలో ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన ఇప్పటికే జరిగింది అని అన్నారు. టెండర్లు పిలిచాము అని చెప్పిన ఆయన... 18 నెలల్లో నిర్మాణం పూర్తి చేయాలని నిర్దేశించాము అని పేర్కొన్నారు. అంతకంటే ముందే నిర్మాణం పూర్తవుతుందని భావిస్తున్నాము అన్నారు. అయోధ్యలో రామజన్మభూమి ఆలయ నిర్మాణ కమిటీని స్థలం కేటాయించాలని కోరాము అని వివరించారు. దాన్ని బట్టి ఆలయమో, భజన మందిరమో నిర్మించాలని భావిస్తున్నాము అన్నారు. ఇంకా వారి నుంచి ఎలాంటి స్పందనా రాలేదు అని ఆయన పేర్కొన్నారు.

వివిధ పీఠాధిపతుల ఆధ్వర్యంలో గో మహాసమ్మేళనం నిర్వహించాము అని ఆయన తెలిపారు. ఆలయాలకు ఆవును దూడను ఇచ్చే కార్యక్రమం చేపట్టాము అని వివరించారు. ఇప్పటికే వంద ఆలయాలకు ఇచ్చాము అని అన్నారు. గో సంపద పరిరక్షణ ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని సీఎం జగన్ ఆదేశాల మేరకు నిర్వహించామని తెలిపారు. గోవును పూజిస్తే ముక్కోటి దేవతలను పూజించినట్లే అన్న మాట ప్రకారం పని చేస్తున్నాము అని అన్నారు. గోవు ఆధారిత వ్యవసాయాన్ని సైతం ప్రోత్సహించాలని నిర్వహించాము అని పేర్కొన్నారు. గోవు ఆధారిత ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలను టీటీడీ కొనుగోలు చేస్తుంది అని పేర్కొన్నారు. టీటీడీ ప్రసాదము, నిత్యాన్నదానానికి అవసరమైన అన్నింటిని గో ఆధారిత వ్యవసాయం ద్వారా సేకరించి రైతులను ప్రోత్సహించాలని భావిస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: