తనకు అండగా ఉండేవారికి న్యాయం చేయడంలో జగన్‌ని మించిన నాయకులు లేరనే చెప్పాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో...నాయకులని వాడుకుని వదిలేసే వాళ్ళు ఎక్కువైపోయారు. కానీ జగన్ అలా కాదు...నాయకులని ఉపయోగించుకుంటూనే...వారికి సరైన న్యాయం చేస్తారు. పార్టీ కోసం నిలబడే నేతలకు...ఏదొక సమయంలో న్యాయం చేస్తారు. అలాగే తన పట్ల విధేయత చూపే వారికి పెద్ద పీఠ వేస్తారు. తాజాగా జగన్ ఎమ్మెల్సీ పదవుల పంపకాల విషయంలో అదే చేశారు.

కృష్ణా జిల్లాలో మొదట నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న ఇద్దరు నాయకులకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. కమ్మ వర్గానికి జగన్ యాంటీగా ఉంటారనే ప్రచారం ఉన్న విషయం తెలిసిందే. కానీ అదే వర్గానికి చెందిన తన సన్నిహితుడు తలశిల రఘురామ్‌కు జగన్ ఎమ్మెల్సీ ఖరారు చేశారు. అలాగే నందిగామ నియోజకవర్గంలో పార్టీ కోసం పనిచేస్తున్న మొండితోక అరుణ్ కుమార్‌కు ఎమ్మెల్సీ ఇచ్చారు.

అరుణ్...ప్రస్తుతం నందిగామ వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న మొండితోక జగన్మోహన్ రావు సోదరుడు. ఈ ఇద్దరు అన్నదమ్ములు వైసీపీ కోసం కష్టపడుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇద్దరికీ జగన్ న్యాయం చేశారు. ఇక తలశిల గురించి చెప్పాల్సిన పని లేదు. మొదట్లో కాంగ్రెస్‌లో పనిచేసిన రఘురామ్...వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌కు అండగా ఉంటూ వస్తున్నారు. అధికారంలో లేనప్పుడు కూడా ఆయన వెన్నంటే ఉన్నారు. అలాగే పాదయాత్ర సమయంలో కీలకంగా వ్యవహరించారు.

అధికారంలోకి వచ్చాక క్యాబినెట్ ర్యాంకు హోదాలో సీఎం కార్యక్రమాల సమన్వయకర్తగా పనిచేస్తున్నారు. అలా తనకు ఎప్పుడు అండగా ఉంటున్న తలశిలకు జగన్ ఎమ్మెల్సీ ఫిక్స్ చేశారు. అయితే తలశిలకు ఎమ్మెల్సీ ఇవ్వడంలో జగన్ వ్యూహాత్మకంగా ఆలోచించారనే చెప్పాలి. ఎందుకంటే కృష్ణా జిల్లాలో కమ్మ వర్గ ప్రభావం ఎక్కువ ఉంటుంది. అందుకే అదే వర్గానికి చెందిన తలశిలకు పదవి ఇచ్చారు. పైగా తలశిలది మైలవరం నియోజకవర్గం...ఇప్పుడు అక్కడ కొండపల్లి మున్సిపాలిటీకి ఎన్నిక జరుగుతుంది. ఇవన్నీ బేరీజు వేసుకునే తలశిలకు పదవి ఇచ్చినట్లు తెలుస్తోంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: