గుంటూరు జిల్లాలో ఈ సారి కొందరు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు షాక్ తగిలేలా కనిపిస్తోంది. మారుతున్న రాజకీయ సమీకరణాలని బట్టి చూస్తే ఈ సారి కొందరు వైసీపీ ఎమ్మెల్యేలకు సీటు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా జూనియర్ ఎమ్మెల్యేలకు జగన్ షాక్ ఇచ్చేలా ఉన్నారు. ఎందుకంటే ఇప్పటికే కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది. పైగా అపోజిట్‌లో టీడీపీ కూడా బలపడుతుంది. ఇక టీడీపీ-జనసేనలు గానీ పొత్తు ఉంటే సమీకరణాలు మొత్తం మారిపోతాయి. అప్పుడు ఆ రెండు పార్టీల బలాల బట్టి వైసీపీ నుంచి బలమైన అభ్యర్ధులని నిలబెట్టాల్సిన అవసరముంది.

అలా చేయకపోతే మళ్ళీ వైసీపీకి గెలిచే అవకాశాలు ఉండవని పీకే టీం తేల్చేస్తుందట. ఈ సారి ఖచ్చితంగా గుంటూరు జిల్లాలో కొందరు సీట్లు మాత్రం మార్చడం ఖాయమని తెలుస్తోంది. సీనియర్ల సీట్లకు పెద్దగా ఇబ్బంది ఉండదని తెలుస్తోంది. మాచర్లలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, బాపట్లలో కోన రఘుపతి, వేమూరులో మేరుగు నాగార్జున, మంగళగిరిలో ఆళ్ళ రామకృష్ణారెడ్డి, నరసారావుపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ప్రత్తిపాడులో మేకతోటి సుచరిత, గుంటూరు ఈస్ట్‌లో ముస్తఫా సీట్లకు ఎలాంటి ఢోకా లేదని తెలుస్తోంది.

అటు సత్తెనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న అంబటి రాంబాబుకు సీటు గ్యారెంటీనే కానీ, మళ్ళీ సత్తెనపల్లి సీటు ఇస్తారా లేక వేరే సీటు ఇస్తారా? అనేది క్లారిటీ లేదు. ఇటు తాడికొండలో ఉండవల్లి శ్రీదేవి, పొన్నూరులో కిలారు రోశయ్య, వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు, గుంటూరు వెస్ట్‌లో మద్దాలి గిరి సీట్లకు గ్యారెంటీ లేదని తెలుస్తోంది.

అయితే చిలకలూరిపేటలో విడదల రజిని, పెదకూరపాడులో నంబూరు శంకర్ రావు, తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్‌లకు మళ్ళీ అవే సీట్లు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక రేపల్లెలో రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ మళ్ళీ పోటీ చేస్తారో లేదా ఆయన ఫ్యామిలీ నుంచి వేరే వాళ్ళకు అవకాశం ఇస్తారా అనేది చూడాలి.  మొత్తానికైతే కొందరు సీట్లైతే చిరుగుతాయని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: