పెద్దాయ‌న బ‌ర్త్ డే
ఈనాడు అనే
మూడ‌క్ష‌రాల ప్ర‌పంచానికి
రాజసం అందం సోయ‌గం
పొగ‌రు పేరు మ‌రియు కీర్తి
అన్నీ అందించిన పెద్దాయ‌న

 
చెరుకూరి రామోజీ రావు
ప‌ద్మ విభూష‌ణుడు రామోజీ
ఆ గ్రేట్ మీడియా మొగ‌ల్ రామోజీ

వాట్ నాట్ వాట్ ఎల్స్
ఇవాళ ఆయ‌న బ‌ర్త్ డే హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్



ఒక్క‌డే.. మూడ‌క్ష‌రాల మ‌నిషి.. అక్ష‌ర త‌ప‌స్వి.చిరంత‌ర య‌శ‌స్వి.అత‌డే రామోజీ. అత‌డి జీవితం ఎంద‌రికో పాఠం. ఎన్నో దుర్గమా ల‌ను దాటిన వైనం స్ఫూర్తిదాయ‌కం. అందుకే ఇవాళ వ‌రించెనొక అత్యున్న‌త పుర‌స్కారం. అదే ప‌ద్మ విభూష‌ణ్. సీత‌మ్మధార (వైజాగ్‌) నుంచి మొద‌లుకొని హైద్రాబాద్ దాకా ఎన్నో మ‌లుపులు. ఎన్నో గెలుపులు.ఓట‌మి వెక్కిరింత‌ల న‌డ‌మే చేసిన ఆ ప్ర‌యాణం ఈనాడు ఎంద‌రెంద‌రినో  జ‌ర్న‌లిజం వైపు అడుగులు వేసే దిశ‌గా చేసింది. మామూలు భావుల‌ను ఆయ‌న స్థాపించిన ఈనాడు మ‌హాను భావుల‌ను చేసింది.ఈ అక్ష‌ర య‌జ్ఞ ప‌రంప‌రకు ఫ‌లిత‌మే ఈ ప‌ద్మ‌ పుర‌స్కారం.

రాయ‌ద‌గ్గ‌.. గ‌ర్వించ‌ద‌గ్గ ఉదంతాలెన్నో..
70ల కాలంలో వైజాగ్‌లో ఓ డైలీ అటుపై ఇప్పుడ‌ది కొన్ని కోట్ల మందికి రీడ‌ర్ ఫ్రెండ్లీ. ఈనాడు అనే ఈ మూడ‌క్ష‌రాలూ ఆయ‌న‌ను మీడియా మొగ‌ల్ ను చేసింది.చిరంతర ఖ్యాతిని తెచ్చిపెట్టింది.ఇదేం రాత్రికి రాత్రి వ‌రించి వ‌చ్చింది కాదు. ఎన్నో ప్ర‌యాసలు. తొలినాళ్లలో బూద‌రాజు మొద‌లుకొని ఇప్ప‌టి నాగేశ్వ‌ర‌రావు దాకా అంతా క‌ల‌సి ఈనాడు పాత్రికేయ సైన్యాన్ని తీర్చిదిద్దారు. భాష‌కు ఒర‌వ‌డి దిద్దారు. వారంద‌రినీ మ‌ర్చిపోలేద‌త‌డు. అంతెందుకు మా గురువు రావూరి భ‌ర‌ద్వాజ‌కు జ్ఞానపీఠ్ అవార్డు వ‌రించిన వేళ కూడా ఫోన్ చేసి మ‌రీ! అభినందించారు. ఇంత‌కూ రావూరి వారు ఈనాడు కాల‌మిస్ట్ అని మ‌న‌లో ఎంద‌రికి తెలుసు గ‌నుక‌. 70ల కాలంలో జీవ‌న స‌మరం పేరిట వ్య‌థార్థ జీవుల య‌థార్థ గాధ‌లు ప‌దిల ప‌రిచార‌ని ఎంద‌రికి తెలుసు గ‌నుక‌. ఈయ‌నొక్క‌రే కాదు త‌న సంస్థ వాకిట విర‌బూసిన వెలుగు పూల‌నెన్నింటినో చూసి మురిసిపోతారాయ‌న‌. తెలుగు జాతి సంస్కారానికి నిలువెత్తు నిద‌ర్శ‌నం ఆయ‌న‌. ఇవాళ జ‌ర్న‌లిజంలో ఎన్నో మార్పులు.. నానా వెర్రి త‌లలు.. విష‌పు వ‌ల‌లు ప‌న్నుతున్న వేళ ఈనాడు ఇప్ప‌టికీ నిబ‌ద్ధ‌త‌కే విలువ‌నిస్తుంది. అందుకు తార్కాణాలెన్నో.. రాయ‌ద‌గ్గ‌.. గ‌ర్వించ‌ద‌గ్గ ఉదంతాలెన్నో.
 
యావ‌త్ తెలుగు జాతికి ఇదే ఓ ప‌ర్వ‌దినం..
ఇన్నేళ్లైనా ఇప్ప‌టికీ ఆయ‌న క‌నుస‌న్న‌ల్లోనే రామోజీ గ్రూపులన్నీ న‌డుస్తాయ్‌. క్ర‌మ‌శిక్ష‌ణ‌కు కేరాఫ్‌గా నిలుస్తాయ్‌. నాలుగు ప‌దుల సంస్థ ఈనాడు ఐతే.. రెండు ప‌దుల సంస్థ ఈటీవీ. విజువ‌ల్ మీడియాలోనూ అనేకానేక ఒర‌వ‌డులు తీసుకువ‌చ్చారాయ‌న‌.అనేకానేక క‌ష్ట‌న‌ష్టాలు కోర్చి పంచ‌తంత్రం తీశారు. ఈ.. ప‌పెట్ షోకి ఎన్ని ప్ర‌శంస‌లు దక్కాయో! బాపు - ర‌మ‌ణ‌తో శ్రీ భాగ‌వ‌త గాథ కు శ్రీ‌కారం చుట్టారు. ఇంకా ఎన్నో.. ఎన్నెన్నో.. న‌వ‌ల‌, క‌థా స్ర‌వంతికి సైతం ప్రాధాన్యం ఇస్తూ..విపుల‌, చ‌తుర వెలువ‌రించారు. సేద్యంలో సూచ‌న‌లు అందిస్తూ.. మెల‌కువ‌లు నేర్పుతూ అన్న‌దాత ప‌త్రిక‌ను వెలువ‌రిస్తూ రైత‌న్న‌కు బాస‌ట‌గా నిలిచారు.(లాభ‌న‌ష్టాల‌తో సంబంధం అన్న‌ది లేకుండా..) అంతెందుకు ఈటీవీలో ప్ర‌తి ఆదివారం ప్ర‌సార‌మ‌య్యే మార్గ‌ద‌ర్శి (ప్ర‌ముఖుల జీవ‌న ప్ర‌స్థానంపై రూపొందించే ప్ర‌త్యేక కార్య‌క్ర‌మం) ఎంద‌రికో ప్రేర‌ణ‌. ఈ కార్య‌క్ర‌మ‌మంటేనే ఆయ‌న‌కో ప్ర‌త్యేక ఆస‌క్తి.టెలికాస్ట్ అవుతుండ‌గా బాహ్య ప్ర‌పంచంలో జ‌ర‌గానిదేదో జ‌రిగినా.. కార్య‌క్ర‌మ ప్ర‌సారం నిలుపుద‌ల చేయ‌రు గాక చేయ‌రు.అదీ నిబ‌ద్ధ‌త‌.అదీ నిష్టా గ‌రిష్ట‌త‌.ద‌టీజ్ ఈనాడు.. ద‌టీజ్ రామోజీ..ఇవాళ ఏ మీడియా ఆ..విధంగా చేయ‌గ‌ల‌దు  గ‌నుక‌. ఇక ప‌ద్మ‌విభూష‌ణ్ గురించి వాస్త‌వానికి ఎప్ప‌టినుంచో విన‌వ‌స్తోన్న ఓ ప్ర‌తిపాద‌న నేడు కార్య‌రూపం దాల్చ‌డం విశేష‌మే! పాత్రికేయ లోకానికి ద‌క్కిన ఈ గౌర‌వం అనిత‌ర సాధ్యం. వ్య‌క్తి నుంచి వ్య‌వ‌స్థ‌గా ఎదగ‌డం.. అంటే మాట‌ల్లో వ్య‌క్తీక‌రించినంత సులువు కాదు. అదేమంత చిన్న విష‌య‌మూ కాదు. కృష్ణా తీరానికి ఇవాళ ఇది పండుగ స‌మ‌యం. అఖిల ఆంధ్రావ‌నికి.. యావ‌త్ తెలుగు జాతికి ఇదే ఓ ప‌ర్వ‌దినం.
 
చెయ్యెత్తి జై కొట్టు తెలుగోడా..!

సినీ మాధ్య‌మంలోనూ త‌న‌దైన స‌త్తా చాటి, ఉషాకిర‌ణాల ఉష‌స్సు అందించారు. ఈ సంద‌ర్భంగా ప్ర‌తిఘ‌ట‌న  సినిమా గురించి ప్ర‌స్తావించ‌క త‌ప్ప‌దు. వేటూరి వారి సూచ‌న‌తోనే ఈ దుర్యోధ‌న దుశ్శాస‌న ప‌ర్వంలో పాటను క‌థా క్ర‌మ‌ణికలో భాగంగా డైరెక్ట‌ర్ టి.కృష్ణ చిత్రీక‌రించినా .. ఈ పాట రాత ప్ర‌తిని  ఎడిట్  చేసింది మాత్రం రామోజీనే! సినిమా నిడివికి ఈ పాట అడ్డొస్తున్నందున వేటూరి వారి సాహిత్యాన్ని కుదించి, క‌థాగ‌మనానికి అనుగుణ‌మైన రీతిన ఉప‌యోగించేలా కొన్ని సూచ‌న‌లు చేశారు. అంతెందుకు నిన్న‌మొన్న‌టి వేళ త‌న నిర్మాణంలో రూపొందిన ఆనందం సినిమా కోసం దేవిశ్రీ కంపోజ్ చేసిన ఎవ‌రైనా ఎపుడైనా పాట విని ఈ కుర్రాడెవ‌రో గానీ.. బాగా పైకొస్తాడ‌య్యా అని త‌నదైన జడ్జ్‌మెంట్ ఇచ్చారు. త‌రువాత కాలంలో ఇదే నూరుపైస‌ల నిజ‌మైంది కూడా..! ఏదేమైనా.. రామోజీ తోడుంటే ఆనందం తెలుగు జాతి వెంటే.. అన్న‌ది అక్ష‌ర సత్యం. ఈ పుర‌స్కారం.. అక్ష‌ర కృషీవ‌లునికి ప‌ఠిమ‌కు.. గ‌రిమ‌కు సంకేతం.హ్యాపీ బ‌ర్త్ డే స‌ర్ ...

- ర‌త్న‌కిశోర్ శంభుమ‌హంతి


మరింత సమాచారం తెలుసుకోండి: