తాజాగా జ‌రిగిన 12 మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లో వైసీపీ రెండు చోట్ల ఓడిపోయింది. వాటిలో ద‌ర్శి కీలకంగా ఉండ గా.. దీనిని మించి అన్న‌రేంజ్‌లో కృష్ణాజిల్లా కొండ‌ప‌ల్లి ఉంది. తొలిసారి ఏర్ప‌డిన కొండ‌ప‌ల్లి మునిసిపాలి టీకి నిర్వ‌హించిన ఎన్నిక‌ల‌ను.. వైసీపీ నాయ‌కులు.. కీల‌కంగా తీసుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే వ‌సంత కృష్ణ ప్ర‌సాద్‌, పార్టీ ప్ర‌చార ప్రోగ్రాం క‌న్వీనర్, ప్ర‌స్తుతం ఎమ్మెల్సీ టికెట్ పొందిన‌.. త‌ల‌శిల ర‌ఘురాం.తో పాటు.. ఇదే జిల్లా పెడన ఎమ్మెల్యే జోగి ర‌మేష్ కూడా.. ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. ఇక్క‌డ గెలిచి త‌న స‌త్తా చాటాల‌ని.. వ‌సంత భావించారు.

ఇక‌, కొండ‌ప‌ల్లి మునిసిప‌ల్ చైర్మ‌న్ అభ్య‌ర్థిగా ఏకంగా.. జోగి ర‌మేష్ సోద‌రుడు బ‌రిలో నిలిచారు. దీంతో వైసీపీ నేత‌లు దీనిని ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. మ‌రోవైపు ప్ర‌చార బాధ్య‌త‌ల‌ను త‌ల‌శిల ర‌ఘురాం తీసుకున్నారు. అయిన‌ప్ప‌టికీ.. ఇక్క‌డ త్రిముఖ వ్యూహం బెడిసి కొట్టింది. వాస్త‌వానికి కొండపల్లి మున్సిపాలిటీలో వైసీపీ, టీడీపీ నడుమ హోరాహోరీ పోరు సాగింది. ఎమ్మెల్యే వసంత  ఇక్కడ వైసీపీ గెలుపును ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. చివరి నిమిషం వరకు అధికార పార్టీ నాయకులు గెలుపు కోసం తీవ్ర ప్రయత్నాలు చేశారు. అయినా ఫలితం దక్కలేదు.

మొత్తం 29 వార్డులు ఉండగా టీడీపీకి 14.. వైసీపీకి 14 వార్డులు దక్కాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థిని కరిమికొండ శ్రీలక్ష్మి(టీడీపీ రెబ‌ల్‌) గెలుపొందారు. అయితే టీడీపీ నేతల ఆహ్వానం మేరకు ఆమె చంద్రబాబు సమక్షంలో ఆ పార్టీలో చేరారు. దీంతో టీడీపీ బలం 15కు చేరింది. వైసీపీ తరఫున మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ఇక్కడ ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకున్నా, ఎంపీ కేశినేని నాని టీడీపీ తరఫున ఎక్స్‌అఫిషియో ఓటు వినియోగించుకునే అవకాశం ఉంది. ఉత్కంఠ పరిణామాల నడుమ ఎట్టకేలకు కొండపల్లి టీడీపీ ఖాతాలోకి చేరింది.

దీంతో వైసీపీలో అస‌లు ఇక్క‌డ ఏం జ‌రిగింద‌నే చ‌ర్చ జోరందుకుంది. అధికార పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్‌, ఆయన బామ్మర్ది అక్రమాల కారణంగా ఎమ్మెల్యేపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత గూడుకట్టుకుంద‌నే ప్ర‌చారం వైసీపీలో పెల్లుబుకుతోంది. దాని ఫలితంగానే కొండపల్లిలో వైసీపీ ఓటమిపాలైందని విశ్లేష‌కులు చెబుతున్నారు.

2019 ఎన్నికల్లో కొండపల్లి, ఇబ్రహీంపట్నంలో వైసీపీకి సుమారు 4,500 ఓట్ల ఆధిక్యం దక్కగా, ఈసారి కేవలం 1,068 ఓట్ల ఆధిక్యాన్ని మాత్రమే దక్కించుకోగలిగింది. ఈ ప‌రిణామాల‌తో త్రిముఖ వ్యూహం బెడిసి కొట్ట‌డంతోపాటు.. పార్టీకి ఇప్పుడు స‌మాధానం చెప్పుకొనే ప‌రిస్థితి వ‌చ్చింద‌నే గుస‌గుస వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

 

మరింత సమాచారం తెలుసుకోండి: