
పీకల్లోతు కష్టాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు నందమూరి కుటుంబ సభ్యులు అండగా నిలిచేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ తన తాత నందమూరి తారక రామారావు స్థాపించారని... ఈ కట్టె కాలే వరకు తాను తెలుగుదేశం పార్టీ వెంటే ఉంటామని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ వెల్లడించారు. అలాగే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు తాను తప్పకుండా వచ్చి ఆదుకుంటానన్నారు కూడా. ఇప్పుడు అదే సమయం వచ్చినట్లుంది. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరి కాదని కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత దగ్గుబాటి పురందేశ్వరి వెల్లడించారు. రాజకీయ విమర్శలు హుందాగా ఉండాలని... అంతే కాని ఆడవారిని రాజకీయాల్లోకి లాగడం సరికాదన్నారు. మరో వైపు నందమూరి హరికృష్ణ కుమార్తె సుహాసిని కూడా అసెంబ్లీలో జరిగిన వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించారు.