వివేకా హత్య కేసు విచారణ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ కేసు విచారణ దాదాపు ఓ కొలిక్కి వచ్చినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఈ హత్య కేసు విచారణలో సీబీఐకి కీలక వ్యక్తులు ఇచ్చిన వాంగ్మూలాలు అన్నీ ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. వాటిలో చాలా వరకూ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ హత్యలకు సూత్రధారి అని చెబుతున్నట్టుగానే ఉన్నాయి. అయితే.. వివేకా అల్లుడు.. ఆయన కుమార్తె సునీత భర్త.. ఏకంగా జగన్‌ నే అనుమానిస్తూ వాంగ్మూలం ఇవ్వడం.. ఇప్పుడు తెలుగు దేశం అనుకూల పత్రికల్లో అది హైలెట్ కావడం ఇప్పుడు రాజకీయంగా కలకలం రేపుతోంది.


2019 ఎన్నికల్లో గెలిచేందుకు జగనే వివేకా హత్యకు ప్లాన్ చేసి ఉంటారని తాను భావిస్తున్నట్టు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి సీబీఐకి తెలిపారు.  ఈ మేరకు ఆయన వాంగ్మూలం ఇచ్చినట్టు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి. అంతే కాదు.. 2019  ఎన్నికలకు ముందు జగన్ పై కోడి కత్తి దాడి జరిగిందని.. ఆ దాడిలో జగన్‌కు చికిత్స చేసిన వైద్యులకు ఆ తర్వాత మంచి పదవులు దక్కాయని.. ఈ ఘటనను రాజకీయంగా వాడుకున్నట్టు.. వివేకా హత్య ఘటనను కూడా రాజకీయంగా వాడుకునేందుకు జగన్ చేయించి ఉంటాడని తాను భావిస్తున్నట్టు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి తన వాంగ్మూలంలో తెలిపారు.


అయితే వివేకా హత్య విషయంలో మొదట్లో మేం కుటుంబ సభ్యులను అనుమానించలేదని.. అలా చేసి ఉంటే.. జగన్‌, అవినాష్‌ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయేవారని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి  అభిప్రాయపడ్డారు. వివేకా హత్య తర్వాత కేసు విచారణకు సంబంధించి ఏం చేసినా.. ఏం చెప్పినా..  సజ్జల రామకృష్ణారెడ్డికి చెప్పాలని జగన్ భార్య భారతి తమకు సూచించారని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి  తెలిపారు.


వివేకా హత్య జరిగిన రోజు కూడా టీడీపీ నాయకులపై జగన్ అనుమానం వ్యక్తం చేయడం తమకు నచ్చలేదని వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి  తన వాంగ్మూలంలో తెలిపారు. ఆ విషయాన్ని తాను జగన్‌కు అప్పుడే చెప్పాలనని ఆయన వాంగ్మూలంలో తెలిపారు. ఇప్పుడు వివేకా అల్లుడు నర్రెడ్డి రాజశేఖర్‌ రెడ్డి వాంగ్మూలం ఎలాంటి కలకలం సృష్టిస్తుందో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: