గుంటూరు జిల్లా ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్ వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. ప్రత్యేకించి కొందరు వైసీపీ నేతలను టార్గెట్ చేసి మరీ మాట్లాడారు. వారిలో కాకినాడ అర్బన్‌ వైకాపా ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి ఒకరు.. ద్వారంపూడిపై పవన్‌ నిప్పులు చెరిగినట్టు వార్నింగ్ ఇచ్చారు. గతంలో ద్వారంపూడి కుటుంబానికి ఎస్పీ డీటీ నాయక్‌ ట్రీట్‌మెంట్‌ జరిగిందని.. రాబోయే రోజుల్లోనూ మీరు ఇలాగే ప్రవర్తిస్తే భీమ్లా నాయక్‌ ట్రీట్‌మెంట్‌ ఏంటో చూపిస్తానని పవనన్ కల్యాణ్ ఘాటుగా హెచ్చరించారు.


గతంలో ఒకాయన రెడ్డి వైభవం పేరుతో రాసిన పుస్తకానికి తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ముందుమాట రాశారని పవన్‌ గుర్తు చేశారు. అందులో.. ప్రస్తుతం మన సమాజంలో కుల ప్రాధాన్యతలు పెరిగిపోతున్న తరుణంలో ఏ ఇతర కులాన్నీ అగౌరవపరచకుండా, ఎవరి కులాన్ని వారు గౌరవించుకోవడం ఒక సామాజిక అవసరంగా భావిస్తున్నామని సుబ్బారెడ్డి రాశారని పవన్ గుర్తు చేశారు. తాను సుబ్బారెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నానని..  ఒక కులం గురించి అంత ఉన్నతంగా, వాస్తవిక ధోరణితో రాసిన ఆయన ఎందుకు ఒక కులాన్ని వర్గ శత్రువుగా ప్రకటించారని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు.


వైసీపీ ఒక కులాన్ని వర్గ శత్రువుగా చూడటంతో రాష్ట్రం అస్తవ్యస్తమైపోతోందని... తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు, శెట్టిబలిజలకు పడదని తెలిసి.. కోనసీమకు వెళ్లి ఆ రెండు వర్గాల్నీ కలిపి సోషల్‌ ఇంజినీరింగ్‌ చేశానని పవన్ కల్యాణ్‌ అంటున్నారు. అలా చేయడం వల్ల వారేదో నాకు ఓట్లేస్తారని కాదు.. సమాజం బాగుండాలనే అలా చేశానని పవన్ కల్యాణ్‌ గుర్తు చేశారు. ఎవరికీ హాని చేయని వైశ్యులపైనా కొందరు దాడులకు దిగుతున్నారని.. వైశ్యులకే కాదు యానాదులు, రెల్లి, ముద్దరాసి కులస్తులకు, బీసీ సంచార జాతులకు, ఎస్సీ, ఎస్టీ సోదరులకు ఇలా అన్ని వర్గాలకూ జనసేన  అండగా ఉంటుందని పవన్ అన్నారు.

ఇదే సభలో పవన్ కల్యాణ్‌ వైసీపీ మంత్రులను అవహేళన చేశారు. జనసేన ఆవిర్భావ సభకు బయల్దేరబోయే ముందు కొందరు మంత్రులు నన్ను తిడుతూ మాట్లాడారని.. మంత్రి వెలంపల్లి.. వెల్లుల్లి, గోడక్కొడితే తిరిగి రాని బంతి, చేమంతి.. అవంతి.. నన్నేదో అన్నారట అంటూ వారిని పవన్ కల్యాణ్ ఎద్దేవా చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: