సరిహద్దుల కోసం దేశాల మధ్య వివాదాలు చూసి ఉంటాం. కానీ.. రాష్ట్రాల మధ్య కూడా అలాంటి పరిస్థితులు నెలకొంటున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర మధ్య సరిహద్దు వివాదం ఎప్పటి నుంచో ఉండగా.. ఇప్పుడు మరోసారి అది తెరపైకి వస్తోంది. కర్ణాటక భూభాగంలోని ఒక్క అంగుళాన్ని కూడా... పొరుగు రాష్ట్రానికి ఇచ్చేది లేదని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై అంటున్నారు. తమ రాజకీయ ప్రయోజనాల కోసం మహారాష్ట్ర నేతలు ప్రజల్లో భాషా ద్వేషాన్ని రెచ్చగొడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు.


సరిహద్దు సమస్యను ఉపయోగించకోవద్దని మరాఠా నేతలకు బొమ్మై సూచిస్తున్నారు. అయితే.. బొమ్మై కూడా వివాదస్పదంగానే మాట్లాడుతున్నారు. కన్నడ మాట్లాడే అనేక ప్రాంతాలు మహారాష్ట్రలో ఉన్నాయని వాటిని కర్ణాటకలో కలపడంపై ఆలోచిస్తున్నామని బొమ్మై చెబుతుండటం విశేషం. కర్ణాటక సరిహద్దుల్లోని చాలా ప్రాంతాల్లో మరాఠా మాట్లాడేవారు ఉన్నారని ఇటీవల మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ అనడం ఈ వివాదానికి దారి తీసిందని చెప్పొచ్చు.


మహారాష్ట్రలో భాగం కావడానికి వారు చేస్తున్న పోరాటానికి మద్దతు ఇస్తామంటూ మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు రెండు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధానికి దారి తీస్తున్నాయి. అజిత్ పవార్ వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా కన్నడ నేతలు తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం తలెత్తిందని దాన్ని కప్పిపుచ్చుకునేందుకే ఈ డ్రామాలని కామెంట్ చేస్తున్నారు.


మహారాష్ట్ర ప్రభుత్వ మనుగడకోసం సరిహద్దు సమస్యను తెరపైకి తెస్తున్నారని కర్ణాటక నేతలు  ఆరోపిస్తున్నారు. సరిహద్దు సమస్య విషయంలో తమకు స్పష్టత ఉందని ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కర్నాటక నేతలు తేల్చి చెబుతున్నారు. కర్ణాటకలోని మరాఠి మాట్లాడే వారి పోరాటానికి సహకరిస్తామని మహారాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మహారాష్ట్ర డిఫ్యూటీ సీఎం అజిత్ పవార్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో సద్ధుమణిగేలా కనిపించడం లేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: