జగన్మోహన్ రెడ్డిపైన తనలో పేరుకుపోయిన అసంతృప్తిని ఆనం రామనారాయణరెడ్డి ఈ రూపంలో తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లుంది. విషయం ఏమిటంటే నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికల్లో పోటీచేసేందుకు తనకు టికెట్ ఇవ్వాలంటూ బిజివేముల కైవల్యారెడ్డి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలవటం కలకలం రేపుతోంది. బిజివేముల కైవల్యారెడ్డి ఎవరోకాదు ఆనం రామనారాయణరెడ్డి కూతురే. కడప జిల్లాలోని బద్వేలు మాజీ ఎంఎల్ఏ, మాజీ మంత్రి బిజివేముల వీరారెడ్డి కూతురు విజయమ్మ కొడుకు రితేష్ రెడ్డిని కైవల్యా వివాహం చేసుకున్నారు.






ఆనం గతంలో ఆత్మకూరునుండి ప్రాతినిధ్యం వహించిన విషయం అందరికీ తెలిసిందే. ఇప్పటికీ ఆనంకు ఆత్మకూరులో గట్టి మద్దతుదారులున్నారు. కాబట్టే కైవల్య ఇక్కడ పోటీకి రెడీఅయ్యారు. మరి లోకేష్ ఏమి హామీఇచ్చారో చంద్రబాబునాయుడు ఏమి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. మంత్రిగా పనిచేసిన గౌతమ్ రెడ్డి చనిపోవటంతో ఇక్కడ ఉపఎన్నిక అనివార్యమైంది. దాంతో గౌతమ్ తమ్ముడు విక్రమ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.  తమ అభ్యర్ధి పోటీచేయబోతున్నట్లు బీజేపీ చీఫ్ సోమువీర్రాజు ప్రకటించారు.






టీడీపీ బరిలో ఉండదని, కాబట్టి పోటీ ఏకపక్షమనే అందరు అనుకుంటున్నారు. సరిగ్గా ఈ సమయంలోనే కైవల్యారెడ్డి తెరమీదకు రావటం ఆశ్చర్యంగానే ఉంది. బిజివేముల ఆడపడుచుగా కైవల్య పోటీలోకి వచ్చే అవకాశమైతే లేదు.  తండ్రితో మాట్లాడుకుని మద్దతు విషయంలో గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాతే కైవల్య రంగంలోకి దిగినట్లు సమాచారం. ఎందుకంటే ఆనంకు ఎప్పటినుండో జగన్ అంటే మంటగా ఉంది.






తనకు మంత్రిపదవి ఇవ్వలేదని, జిల్లా యంత్రాంగం, పార్టీలోని నేతలు ఎవరు పట్టించుకోవటంలేదని బాగా మండుతున్నారు. తొందరలోనే ఆనం మళ్ళీ టీడీపీలోకి వెళిపోతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ఆయన కూతురు కైవల్య పోటీ విషయంలో తెరమీదకు వచ్చారంటే తండ్రి మద్దతులేకుండా జరగే అవకాశం లేదు. కాబట్టి కైవల్య గనుక టీడీపీ తరపున దిగితే పోటీ రసవత్తరంగా ఉండటమే కాకుండా ఆనం కెపాసిటి ఏమిటో కూడా తేలిపోతుంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: