వైసీపీ అధినేత వైఎస్ జగన్ కొన్ని విషయాల్లో చాలా మొండిగా ఉంటారు. ఎవరు చెప్పినా వినరు.. ఓ నిర్ణయానికి వస్తే.. బ్రహ్మదేవుడు అడ్డువచ్చినా వెనక్కి తగ్గను అంటారు. ఇలాంటి మొండితనం రాజకీయాల్లో కొన్నిసార్లు బాగా కలసివస్తుంది..మరికొన్నిసార్లు ఎదురుదెబ్బలు తగిలేలా చేస్తుంది. విద్యుత్ కొనుగోలు ఒప్పందాల విషయంలో జగన్ వైఖరి కూడా అంతే.


ఈ విద్యుత్ కొనుగోలు ఒప్పందాల్లో భారీగా అవినీతి జరిగిందని జగన్ ఫీలయ్యారు. అందుకే వాటిని రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలుస్తామంటున్నారు. కానీ ఇందుకు అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. మొదట్లోనే కేంద్ర కార్యదర్శి ఒప్పందాల రద్దు వద్దని లేఖ రాశారు. ఆ తర్వాత కేంద్ర మంత్రి కూడా చెప్పారు. అయినా జగన్ మాత్రం ఒప్పందాల రద్దుకే మొగ్గుచూపారు.


దీంతో ఆయా కంపెనీలు విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ను ఆశ్రయించాయి. దీనిపై విచారించిన ట్రైబ్యునల్ జగన్ కు ఊహించని షాక్ ఇచ్చింది. పీపీఏలు రద్దు చేయవద్దని ఆదేశం జారీ చేసింది. ఈ కంపెనీలు.. కడప, అనంతపురం జిల్లాల్లో పవన, సౌర విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాయి. ఈ కంపెనీలు గతప్రభుత్వ హయాంలో డిస్కంలతో ఒప్పందం కుదుర్చుకున్నాయి.


ఈ ఒప్పందాల రద్దు కుదరదన్న ట్రైబ్యునల్.. పీపీఏలపై ప్రజాభిప్రాయ సేకరణ అవసరం లేదని కూడా చెప్పింది. ఈ మూడు సంస్థలు విద్యుత్ అప్పిలేట్ ట్రైబ్యునల్ ముందు బలంగా వాదించాయి. విద్యుత్ నియంత్రణ చట్టంలోని సెక్షన్‌-63 ను ఇవి తమ వాదనల్లో కోట్ చేశాయి. అంతే కాదు.. డిస్కంలకు ఒప్పందాలు రద్దు చేసే అవకాశం కూడా లేదని ఈ మూడు కంపెనీలు లా పాయింట్ లాగాయి.


కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టామని వాదించాయి. ఈ ప్రాజెక్టులపై తాము ఇప్పటికే వందల కోట్ల రూపాయలు పెట్టామని ట్రైబ్యునల్ ముందు వాదించాయి. మొత్తానికి ఈ కంపెనీల వాదనలతో ఏకీభవించిన ట్రైబ్యునల్ పీపీఏ ఒప్పందాల రద్దు చేయవద్దని ఆదేశించింది. మరి ఇప్పుడు జగన్ ఏం చేస్తారో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: