ఏపీ రాజకీయాలని ఎప్పుడు కులాలే నడుపుతుంటాయి. కులాల ఆధారంగానే నేతలు రాజకీయాలు చేస్తుంటారు. ఇక ఒకో రాజకీయ పార్టీ ఒకో కులానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉంటున్నాయి. వైసీపీ-రెడ్డి సామాజికవర్గానికి, టీడీపీ-కమ్మ సామాజికవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. అయితే 2009 నుంచి చిరంజీవి ప్రజారాజ్యం ద్వారా కాపు సామాజికవర్గానికి ప్రాతినిధ్యం దొరికింది. ఆ పార్టీ మూసేసిన పవన్ కల్యాణ్ జనసేన ద్వారా కాపులకు మరో అవకాశం దక్కింది. కాకపోతే వైసీపీ, టీడీపీ వారి సామాజికవర్గాల వారికి గట్టిగానే న్యాయం చేసుకుంటాయి.


అధికారం ఎప్పుడు ఈ రెండు పార్టీల మధ్యే నడుస్తుంది కాబట్టి ఆ సామాజికవర్గాలకు తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్నాయి. కానీ ప్రజారాజ్యం, జనసేనల ద్వారా కాపులకు పూర్తిగా అన్యాయం జరిగిందనే చెప్పొచ్చు. 2009లో భారీ అంచనాలతో చిరంజీవి ప్రజారాజ్యం పెట్టారు. అప్పుడు ఎక్కడలేని కాపు నేతలలతో పాటు మెగా అభిమానులు చాలామంది చిరంజీవి దగ్గరకెళ్లిపోయారు. ఆ ఎన్నికల్లో 18 సీట్లు గెలుచుకుని కొంతవరకు పర్వాలేదనిపించారు.


కానీ చిరంజీవి మాత్రం వారికి ఏ మాత్రం అండగా ఉండకుండా పార్టీని కాంగ్రెస్ లో కలిపేసి తన దారి తాను చూసుకున్నారు. సరే అది ముగిసింది. పవన్ కల్యాణ్ జనసేన వచ్చింది. ఇక్కడ కూడా కాపులు, మెగా అభిమానులు జనసేనకు మద్ధతు ఇచ్చారు. కానీ మొన్న ఎన్నికల్లో జనసేనకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో తెలిసిందే. మళ్ళీ కాపులకు, మెగా అభిమానులకు నిరాశే ఎదురైంది. ఈ విధంగా వారికి రెండు సార్లు దెబ్బపడింది.


ఈ క్రమంలోనే పవన్ వాళ్ళని మూడోసారి ముంచేలా కనిపిస్తున్నారు. త్వరలో స్థానిక సంస్థలు, మున్సిపల్, పంచాయ‌తీ ఎన్నికలు రానున్నాయి. అందులో కూడా కాపులు, అభిమానులు జనసేన వైపే మొగ్గుచూపే అవకాశముంది. కానీ ఈ ఎన్నికల్లో కూడా జనసేనకు అంత సీన్ వచ్చేలా లేదు. మెజారిటీ సీట్లు వైసీపీనే కైవసం చేసుకోవడం ఖాయం. తర్వాత టీడీపీ కొంతవరకు సీట్లు రాబట్టోచ్చు. జనసేనకు మాత్రం ఎక్కువ సీట్లు దక్కించుకోవడం చాలా కష్టం. మొత్తానికైతే కాపులకు వారి జనసేన పార్టీ ద్వారా న్యాయం జరగడం గగనమే.  


మరింత సమాచారం తెలుసుకోండి: