ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ మంత్రులకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈరోజు జరిగిన కేబినేట్ సమావేశం అనంతరం జగన్ మంత్రులకు పలు సూచనలు చేశారు. ఈ నెలలోనే స్థానిక ఎన్నికలు జరగనుండటంతో సమావేశంలో జగన్ కీలక వ్యాఖ్యలు చేయడంతో పాటు హెచ్చరికలు జారీ చేశారు. మంత్రులు అన్ని జిల్లాలలో వ్యూహాలు సిద్ధం చేసుకుని గెలుపు దిశగా అడుగులు వేయాలని సీఎం సూచించారు. 
 
ఇంఛార్జ్, జిల్లా మంత్రులు స్థానిక సంస్థల ఎన్నికల బాధ్యతలు తీసుకోవాలని చెప్పారు. జిల్లాలలో గ్రూప్ తగాదాలపై దృష్టి పెట్టాలని నాయకులందరూ కలిసి సమిష్టిగా ముందుకు సాగేలా చూడాలని సూచించారు. మంత్రుల పనితీరుపై తన దగ్గర నివేదికలు ఉన్నాయని మంత్రుల సొంత నియోజకవర్గాల్లో పార్టీ ఓడితే మంత్రి పదవులు ఊడతాయని హెచ్చరించారని సమాచారం. జగన్ అలా చెప్పడంతో మంత్రులు షాక్ అయినట్టు తెలుస్తోంది. 
 
ఎమ్మెల్యేలు కష్టపడి పని చేయాలని ప్రజల్లో వ్యతిరేకత ఉంటే వచ్చే ఎన్నికల్లో సీటు ఇవ్వనని జగన్ చెప్పినట్టు సమాచారం. మార్చి 9వ తేదీ నుండి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని తెలుస్తోంది. మంత్రులకు సీఎం ఈ నెల 8వ తేదీ వరకు కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించుకోవాలని సూచించారు. ఎన్నికల్లో మద్యం, డబ్బు పంపిణీకి అవకాశమే ఉండకూడదని ఆదేశించారు. 
 
వైసీపీ ప్రచారానికి తక్కువ సమయం ఉండటంతో ఇప్పటినుండే గెలుపు దిశగా వ్యూహాలు రచిస్తోంది. చంద్రబాబు కూడా రాష్ట్రంలో నేతల్ని ఎన్నికలకు సిద్ధం కావాలని సూచించారు. టీడీపీ నేతలు ఇప్పటికే ప్రజల్లోకి వెళుతూ ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వైసీపీ సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళుతూ గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. 2019 ఎన్నికల్లో 151 అసెంబ్లీ స్థానాలలో ఘనవిజయం సాధించిన వైసీపీ 10 నెలల పరిపాలనకు ప్రజలు ఇచ్చే  మార్కులుగా ఈ ఎన్నికలను భావించాలి. ఈ ఎన్నికల్లో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు ఎలాంటి ఫలితాలు అందుకుంటాయో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: