పోలవరం ప్రాజెక్టు అథారిటీ మరోసారి భేటీ కానుంది. నవంబరు 2వ తేదీన హైదరాబాద్‌లోని అథారిటీ కార్యాలయంలో పోలవరం భవితవ్యాన్ని తేల్చే సమావేశం జరగనుంది. పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర ఆర్థిక శాఖ పెట్టిన షరతులే ప్రధాన ఎజెండాగా ఈ సమావేశం జరగనుంది. 2014 ఏప్రిల్‌ ఒకటి నాటికి సంబంధించిన వ్యయం అంచనాల ప్రకారమే ధరలు చెల్లిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇప్పటికే స్పష్టం చేసింది. దీని ప్రకారం 20 వేల 398 కోట్లకు సవరించిన అంచనాలను ఈ భేటీలో చర్చించనున్నారు. ఈ భేటీలో పోలవరం అంచనాలపై తమ వాదనను గట్టిగా వినిపించేందుకు ఏపీ సర్కార్‌ సన్నద్ధమవుతోంది.

పోలవరం ప్రాజెక్టు అంచనాలకు సంబంధించి గతంలో ఏం జరిగాయి..? అంచనాలు ఎలా తారుమారయ్యాయి...? కేంద్ర ప్రభుత్వం పాత అంచనాలనే పరిగణనలోకి తీసుకుంటే పోలవరం భవిష్యత్తేంటీ..? అనే అంశంపై ఏపీ ప్రభుత్వం ప్రజంటేషన్‌ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పునరావాసం విషయంలో కేంద్ర నిధులు తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుందని గట్టిగా తన వాదనను వినిపిచనుంది ఏపీ ప్రభుత్వం. అవసరమైతే కేంద్రమే ఈ ప్రాజెక్టును చేపట్టడానికి ముందుకు వస్తే.. తాము అప్పగించడానికి సిద్దంగా ఉన్నామని ఇప్పటికే స్పష్టం చేసింది రాష్ట్ర ప్రభుత్వం. అదే విషయాన్ని భేటీలో కూడా ప్రస్తావించే సూచనలు కన్పిస్తున్నాయి‌.  

ఇక పోలవరం విషయంలో జరుగుతున్న పరిణామాలపై అథారిటీ అధికారుల్లోనూ అంతర్గతంగా చర్చలు  సాగుతున్నాయి‌.  ఒకవైపు ఆర్థికశాఖ విధించిన షరతు ఆమోదించి పంపాలనేది కేంద్ర జలశక్తి మంత్రి నుంచి వచ్చిన ఆదేశం. మరోవైపు పోలవరం ప్రాజెక్టు నిర్మాణ బాధ్యత అథారిటీదే. కేంద్రం  షరతు ప్రకారం నిధులిస్తే ప్రాజెక్టు పూర్తి చేయడమూ సాధ్యం కాదు.  దీంతో తాము ఏం నిర్ణయం తీసుకోవాలన్న దానిపై అథారిటీ పెద్దలు అయోమయంలో ఉన్నారు.  

పోలవరం భవిష్యత్తే ప్రశ్నార్థకంగా మారిన తరుణంలో కీలకమైన పీపీఏ భేటీ జరగనుంది. పోలవరం నిర్మాణం బాధ్యత కేంద్రానిదే.. విభజన చట్టం కూడ అదే విషయాన్ని స్పష్టంగా చెబుతోందనేది ప్రభుత్వ వాదన. అయితే కేంద్రం మాత్రం పాత అంచనాలకే కట్టుబడి ఉంటాం.. పునరావాసంతో సంబంధం లేదన్నట్టుగానే వ్యవహరిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: