మున్సిపల్ ఎన్నికల్లో కొత్త రాజకీయం రాజుకుంటోంది. గతంలో ఎన్నికల ముందు పార్టీల మార్చే నాయకులు ఇప్పడు నామినేషన్ వేసిన తర్వాత కూడా పార్టీలు మారుతున్నారు. ఇప్పడు పలాస కాశీబుగ్గలో క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. కౌన్సిలర్ అభ్యర్థులుగా టీడీపీ తరుపున నామపత్రాలను దాఖలు చేసిన నలుగురుని మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలోనే వైకాపా లాగేసుకుంది. తమ పార్టీ తీర్థం ఇచ్చింది. ఇక ఇప్పుడు పరువు మిగుల్చుకోవాలని భావిస్తున్న టీడీపీ మిగిలిన కౌన్సిలర్ అభ్యర్థులనైనా కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతోంది.

వైసీపీ దెబ్బతో షాక్ తిన్న టీడీపీ నేతలు తమ నేతలను కాపాడుకునేందుకు రహస్య ప్రాంతాలకు తెదేపా తరలించారు. దీంతో శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ పుర ఎన్నికలు రస్తవత్తరంగా మారాయి. ఎన్నికల్లో పోటీ చేస్తున్న టీడీపీ అభ్యర్థుల్లో నలుగురు మంత్రి సీదిరి అప్పలరాజు సమక్షంలోనే వైసీపీ కండువా వేసుకున్నారు. 4వ వార్డుకు చెందిన వి.శ్రీనివాసరావు, 8వ వార్డుకు చెందిన ఆర్‌.మురళీకృష్ణ, 20వ వార్డుకు చెందిన బి.వెంకటలక్ష్మీ, 29వ వార్డుకు చెందిన సనపల దీప్తి భర్త వైసీపీలో చేరిపోయారు.

4వ వార్డులో మరో అభ్యర్థిని వి.మనీషా టీడీపీ తరపున నామినేషన్ వేసినా.. వైకాపా తీర్థం పుచ్చుకున్నశ్రీనివాసరావు కుమార్తె కావటంతో ఈ వార్డు ఏకగ్రీవం అయ్యే అవకాశం కనిపిస్తోంది. మిగిలిన వార్డుల్లో టీడీపీ తరపున పోటీలో ఉన్న అభ్యర్థులను కూడా  ఉపసంహరింపజేసేందుకు వైకాపా వ్యూహం పన్నుతోంది.

వైసీపీ వ్యూహాలను అడ్డుకునేందుకు పలాసలో ఛైర్మన్‌ అభ్యర్థిగా పోటీలో ఉన్న వజ్జ బాబురావు ఇంటి వద్ద మొన్న టీడీపీ నేతలు సమావేశమయ్యారు. పార్టీ వ్యూహంపై చర్చించుకుని మిగిలిన అభ్యర్థులను వాహనాల్లో రహస్య ప్రాంతానికి తరలించారు. సాధారణంగా ఎన్నికలు గెలిచిన తర్వాత ఛైర్మన్‌ ఎంపిక విషయంలో గతంలో అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించడం చూస్తుంటాం. కానీ ఈసారి ఎన్నికలు జరగకముందే అభ్యర్థులను రహస్య ప్రాంతాలకు తరలించటం పలాస కాశీబుగ్గలో ప్రత్యేకతగా నిలుస్తోంది. మరి ఇక్కడ ఫైనల్‌ గా ఏం జరుగుతుందనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: