కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా ఉన్న వేళ.. మహానాడు కార్యక్రమాన్ని కూడా జూమ్ లోనే ముగించింది తెలుగుదేశం పార్టీ. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్న సందర్భంగా రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందంటూ పదే పదే విమర్శలు సంధిస్తున్నారు చంద్రబాబు లోకేష్. కరోనా కాలంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలంటూ విద్యార్థులు, తల్లిదండ్రులతో చర్చలు నిర్వహిస్తున్నారు. అయితే ఇవన్నీ కేవలం జూమ్ యాప్ లో మాత్రమే జరుగుతున్నాయి. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుతున్న వేళ.. నిరసన కార్యక్రమాలకోసమైనా అధినేతలు జనాల్లోకి వస్తారని టీడీపీ శ్రేణులు ఆశతో ఉన్నాయి.

'నిరసన వారం' ఎవరి ఆధ్వర్యంలో..
కరోనా ప్రభావంతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వర్గాలను ఆదుకోవాలంటూ డిమాండ్ చేస్తున్న టీడీపీ.. ఈనెల 16నుంచి 22వరకు నిరసన వారం పేరుతో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టబోతోంది. అయితే ఈ కార్యక్రమాలన్నీ క్షేత్ర స్థాయిలో జరిగేవే. వీటికి చంద్రబాబు, లోకేష్ సహా పార్టీ పెద్ద తలకాయలు వస్తాయని అంచనా వేయలేం. ఎక్కడికక్కడ తహశీల్దార్ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వడం, ఆర్డీవో, కలెక్టరేట్ల వద్ద నిరసన తెలియజేయడం, చివరి రోజున 175 నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు నిర్వహించడం.. ఇదీ ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.

కరోనా కష్టకాలంలో కూడా ఎక్కడా లోటు లేకుండా అన్ని వర్గాలకు ఆర్థిక సాయం చేస్తోంది వైసీపీ ప్రభుత్వం. ఇటీవలే చిరు వ్యాపారులకు వడ్డీ రాయితీ రుణాలు మంజూరు చేసింది. తాజాగా వాహన మిత్ర నిధులూ జమచేస్తోంది. నేతన్నలకు నేస్తం నిధులు గతంలోనే జమ అయ్యాయి, రైతు భరోసా కూడా ఇటీవలే విడుదలయ్యాయి. ఈ దశలో టీడీపీ చేస్తున్న ఆందోళనలకు ప్రజలనుంచి ఎంతవరకు మద్దతు ఉంటుందనేదే ప్రశ్న. నేరుగా బ్యాంకు అకౌంట్లలో ఆర్థిక సాయం పడుతున్న సందర్భంలో ఆయా వర్గాలేవీ టీడీపీ చేస్తున్న నిరసన కార్యక్రమాలను పట్టించుకునే అవకాశమే లేదు.

అధినేతలు బయటకొస్తారా..?
నిరసన కార్యక్రమాల విషయంలో టీడీపీ కాస్త తొందరపడినట్టే లెక్క. అయితే ఈ కార్యక్రమాలకోసమయినా కనీసం అధిష్టానం కదలి వస్తుందా అనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. కరోనా కష్టకాలంలో భయపడి పక్క రాష్ట్రంలో దాక్కున్నారంటూ ఇన్నాళ్లూ వైసీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ పై తీవ్ర విమర్శలు చేశారు. పక్క రాష్ట్రంలో ఉండి విమర్శించే హక్కు వారికి లేదన్నారు. మరిప్పుడైనా వారిద్దరూ నిరసనలకు కదలి వస్తారా. నేరుగా ప్రజలకు తమ వాణి వినిపిస్తారా..? వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: