టీఆర్‌ఎస్‌ పార్టీ దిమ్మతిరిగే షాక్‌ తగిలింది. టీఆర్‌ఎస్‌ పార్టీ కీలక నేత సామ వెంకట్‌ రెడ్డి నిన్న ఆ పార్టీకి రాజీనామా చేశారు. అంతేకాదు... కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు సామ వెంకట్‌ రెడ్డి. తెలంగాణ ఉద్యమం  ప్రారంభం అయినప్పటి నుంచి గులాబీ పార్టీలోనే ఉన్నారు. సామ వెంకట్‌ రెడ్డి ప్రస్తుతం తెలంగాణ కనీస వేతనాల బోర్డు ఛైర్మన్‌గా పనిచేస్తున్నారు. అయితే... బుధవారం రోజున తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డిని ఢిల్లీ లో కలిసారు సామ వెంకట్‌ రెడ్డి. ఈ సందర్భంగానే కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యలో సామ వెంకటరెడ్డి  టీఆర్‌ఎస్‌ పార్టీపై మండిపడ్డారు.   2001 నుంచే తెలంగాణ ప్రైవేట్ ఉద్యోగుల సంఘంగా ఏర్పడ్డామని చెప్పిన ఆయన.. తెలంగాణ యువతకు జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించామని తెలిపారు.  

తెలంగాణ వస్తే తప్ప రాష్ట్ర యువతకు న్యాయం జరగదని భావించామని... కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమానికి వెన్నంటి నిలిచామని గుర్తు చేశారు సామ వెంకటరెడ్డి. కత్తిమీద సాములాంటి ప్రైవేటు ఉద్యోగాలు పోయినా సరే ఉద్యమంలో పాల్గొన్నామని తెలిపిన సామ వెంకటరెడ్డి...  తెలంగాణ వచ్చిన తర్వాత స్థానిక యువతకు 75శాతం రిజర్వేషన్ కల్పించాలని అడిగితే అందుకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అంగీకరించలేదని మండిపడ్డారు.  చట్టం చేస్తే పరిశ్రమలు రావని వారు చెబుతున్నారని... అధికారాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీఆర్ఎస్ పార్టీని వీడుతున్నామని స్పష్టం చేశారు సామ వెంకటరెడ్డి.   మాకు 33 జిల్లాల్లో కమిటీలున్నాయి... 40-50వేల మందితో మా సంఘం చాలా బలంగా ఉందన్నారు.  కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం రేవంత్ రెడ్డి, మాణిక్యం ఠాగూర్‌తో మాట్లాడ్డం కోసం ఢిల్లీకి వచ్చామని... ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు ఎలాగూ ఇవ్వడం లేదు, కనీసం ప్రైవేటు ఉద్యోగ అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నారని వెల్లడించారు.

 తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పరిశ్రమల ఏర్పాటుకు ఎన్ని భూములిచ్చారో ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని... ఆ భూములివ్వడం ద్వారా తెలంగాణ యువతకు ఎంత మందికి ఉద్యోగాలిచ్చారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.  స్థానిక యువతకు 75శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ మాకు హామీ ఇచ్చిందని...అందుకే కాంగ్రెస్ వైపు మొగ్గుచూపుతున్నామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి మొగ్గు చూపుతున్నామని... కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కరీంనగర్ సభలో చెప్పిన మాటలు గుర్తున్నాయని తెలియజేశారు.  టీఆర్ఎస్ పార్టీ ని కాంగ్రెస్ లో విలీనం చేస్తామన్నారు... కానీ అది జరగలేదని పేర్కొన్నారు.  పదవులపై ఆశతో మేము కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు జరపడం లేదని.. ఇప్పట్లో ఎన్నికలు కూడా లేవని తెలిపారు సామ వెంకటరెడ్డి.






 
 

మరింత సమాచారం తెలుసుకోండి: