జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఉద్యోగులతో పెట్టుకుంటున్నారు. కొరివితో తలగోక్కుంటే ఏమవుతుందో ఎంప్లాయిస్ తో పెట్టుకుంటే కూడా సేమ్ టు సేమ్. తనకున్న ముందున్న వాళ్ళు ఉద్యోగులతో పెట్టుకుంటే ఏమైందో తెలిసి కూడా మళ్ళీ జగన్ అనవసరంగా గొడవలు పడుతున్నారు. పీఆర్సీ విషయంతో మొదలైన సమస్య, ఇపుడు హెచ్ఆర్ఏలో కోత దాకా వచ్చింది. ముందు ముందు ఇంకెంత దూరం వెళుతుందో తెలీదు.




ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోల్లో హెచ్ఆర్ఏ లో కోత పెట్టడం, సీసీఏ ఎత్తేయటంతో ఉద్యోగులందరు మండిపోతున్నారు. విచిత్రమేమిటంటే గత ప్రభుత్వం ఇచ్చిన రాయితీలను కూడా జగన్ రద్దు చేయటం ఏమీ బావోలేదు. కరోనా కష్టాలని, ఆర్ధిక సమస్యలని ఏదేవో జగన్ చెప్పిన వాటన్నింటినీ ఉద్యోగసంఘాల నేతలు విన్నారు. ఫిట్మెంట్ తగ్గించి పీఆర్సీ ప్రకటించినా ఏదోలే అని సరిపెట్టుకున్నారు.




మామూలుగా అయితే ఇంటెరిమ్ రిలీఫ్ కన్నా తగ్గించి ఫిట్మెంట్ ఫిక్స్ చేయటాన్ని ఉద్యోగులెవరు అంగీకరించరు. కానీ మొన్న ఉద్యోగసంఘాలు అంగీకరించాయి. పీఆర్సీ తగ్గింపు వల్ల జీతాలు కాస్త తగ్గుతాయని తెలిసినా రిటైర్మెంట్ వయసు పెంచారని, ఇళ్ళ స్ధలాల కేటాయింపులో రాయితీలిస్తామని, ప్రాధాన్యత ఇస్తానని జగన్ హామీ ఇస్తే ఎక్కడో ఒకచోట సర్దుబాటు అవుతోంది కదాని ఉద్యోగసంఘాల నేతలు మాట్లాడకుండా పీఆర్సీ తగ్గించినా అంగీకరించారు.




కానీ ఇపుడు హెచ్ఆర్ఏ తగ్గించేయటం, సీసీఏ రద్దుచేయటంతో అందరికీ మండిపోతోంది. కొత్త జీవోలో 50 లక్షల జనాభా ఉన్న నగరంలో పనిచేసే వారికే 24 శాతం ఇంటి అద్దె బత్యం ఇస్తామని ప్రభుత్వం చెప్పటమే విచిత్రం. అసలు రాష్ట్రం మొత్తంమీద 50 లక్షల జనాభా ఉన్న నగరం ఒక్కటికూడా లేదు. కావాలనే ఈ నిబంధన తీసుకొచ్చారని తెలిసిపోతోంది. అడుగడుగునా ఉద్యోగుల ఆర్ధిక ప్రయోజనాలకు దెబ్బ కొడుతుంటే చూస్తు ఎందుకూరుకుంటారు ? అందుకే సమ్మెకు రెడీ అవుతున్నారు.




ఉన్నవాటిని పెంచకపోయినా పర్వాలేదు ఏదో సర్దుకుంటారు.  అంతేకానీ ఇంకా తగ్గించేస్తే ఎలాగ భరిస్తారు. ఇదే పాయింట్ మీద అన్నీ యూనియన్లు ఏకమవుతున్నాయి. అనవసరంగా జగన్ ఉద్యోగులతో పెట్టుకుని వ్యవహారమంతా చివరకు కంపు చేసుకునేట్లే కనబడుతోంది. ఈ ఎపెక్ట్ రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా కనబడుతుందనటంలో సందేహంలేదు.



మరింత సమాచారం తెలుసుకోండి: