పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న వేళ, ప్రచార గడువు ముగిసేందుకు సమయం దగ్గర పడుతుండడంతో పార్టీలన్నీ ప్రచారం షురూ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి తరుఫున ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి విదితమే. రాజమండ్రిలోని వేమగిరిలో నిర్వహించిన భారీ బహిరంగసభలో పాల్గొన్న ప్రధాని మోదీ.. వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడిన తీరుని మీరు చూసే వుంటారు. ఏపీ ప్రజలు వైసీపీకి ఐదేళ్లు అవకాశం ఇచ్చినా వైసీపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని తప్పుబట్టారు. అంతేకాకుండా వైసీపీ పాలనలో ఏపీ ఎన్నడూ లేనంతగా అప్పుల్లో కూరుకుపోయిందని విమర్శించారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో అభివృద్ధి శూన్యమని, అవినీతిలో అయితే మాత్రం నంబర్‌వన్ అంటూ దుయ్యబట్టారు. ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియా ఇక్కడ ఎన్నడూ లేనంతగా స్వైరవిహారం చేస్తున్నాయని ఆరోపించారు. వైసీపీకి ఆర్థిక క్రమశిక్షణ లేదని, 3 రాజధానులు ఏర్పాటు చేస్తామన్న వైసీపీ.. ఐదేళ్లలో ఒక్క రాజధాని కూడా ఏర్పాటు చేయక పోవడం చాలా దారుణం అని ధ్వజమెత్తారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధి అనే పట్టాలపై పరిగెట్టింది. వైసీపీ హయాంలో ఏపీలో అభివృద్ధి పట్టాలు తప్పిందని ఈ సందర్భంగా విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపైనా వైసీపీ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదన్న ప్రధాని.. ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే ఐదేళ్లలో ఈ పరిస్థితి మారుస్తామని అన్నారు.

ఇన్ని మాట్లాడినా ప్రధాని మోడీ జగన్ అనే పేరుని మాత్రం ఎత్తకపోవడం కొసమెరుపు. ఈ విషయాన్ని వైస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు తమకి అనుకూలంగా మార్చుకుని మాట్లాడితే కొందరు రాజకీయ విశ్లేషకులు మాత్రం జగన్ అనే పేరుని కూడా ఎత్తడానికి మోడీ ఇష్టపడడం లేదని, ఇటువంటి నియంతల పేరుని మోడీ తన నోటితో ఉచ్ఛరించరని చెబుతున్నారు. ఇకపోతే దేశంలో ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ప్రతిచోటా ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందన్న మోదీ.. మే 13వ తేదీ ఏపీ రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలవుతుందని చెప్పుకొచ్చారు. ఏపీలో అభివృద్ధి శూన్యమని.. అవినీతి పెరిగిపోయిందంటూ జగన్ ప్రభుత్వంపై ప్రధాని విమర్శలు గుప్పించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: