ఇది రాజకీయ రంగం.. ఇవే నేరాల కథలు. కథలో విలన్ కనిపిస్తున్నాడు. సాక్ష్యాలు ఉన్నాయి. బాధితులు అరిచారు. దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగాయి. కేసులు నమోదయ్యాయి. అరెస్టులు కూడా జరిగాయి. కానీ తర్వాత ఏమవుతోంది? నిష్ఫలతే మిగులుతోంది. ఇది ఏ ఒక్క కేసుకాదండి… ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో గత 10–15 ఏళ్ల రాజకీయ-నేర నేపథ్యం చూస్తే ఇదే కథనం పునరావృతమవుతోంది.


ఒకసారి పరిశీలించండి…

* వివేకానంద రెడ్డి హత్య కేసు: ఆరోపణలు జగన్ మోహన్ రెడ్డికి సన్నిహితులపై ఉన్నాయి. నిందితుల్ని అరెస్ట్ చేశారు, cbi విచారణ చేసింది. కానీ క్లైమాక్స్..? ఇంకా రాలేదు.

* తెలంగాణ ఫోన్ ట్యాపింగ్: ఓదార్పు బృందం వచ్చినంత పని, సర్వేలపై వ్యాఖ్యలు వచ్చినంత పని. కాని అసలు బాస్ ఎవరు? మౌనం చుట్టూ తిరుగుతున్న ఆధారాలు.

* కాళేశ్వరం స్కాం: నిర్మాణంలో అవకతవకలపై కేంద్రం, NGT, వైఎస్ షర్మిల వంటి వారు పదే పదే ప్రస్తావిస్తున్నారు. కానీ అసలు బాధ్యుల దాకా చర్యలు వెళ్ళినట్టే లేవు.

* మద్యం కుంభకోణం కేసు: మిధున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మాజీ మంత్రి నారాయణ స్వామిని విచారణకు పిలిచారు. రూ.3,200 కోట్ల స్కాం అని ఏకంగా ఆరోపణలు ఉన్నాయి. కానీ సూత్రధారులు ఎవరన్న ప్రశ్న ఇంకా అర్థాంతరమే.


ఇది సినిమాలలా సాగుతున్న రాజకీయ నాటకం .. విలన్ ఎవరో తెలుస్తుంది. పోలీసులకు దొరుకుతారు. హీరోలైనా, విలన్‌లైనా బెయిల్ మీద బయటకు వస్తారు. కేసు కోర్టుకి వెళ్ళాక విచారణ ప్రారంభమవుతుంది. సంవత్సరం, రెండేళ్లు… ఒక్క‌రికంటే ఒకరి – శిక్ష పడదు. ఎందుకంటే వ్యవస్థల్లోనే బలహీనతలు ఉన్నాయి. లేదా వ్యూహాత్మక మౌనాలున్నాయి. సినిమాల్లో దర్శకుడు స్టోరీ ప్లాన్ చేస్తాడు. హీరో, విలన్ మధ్య 2–3 సార్లు ఫైట్‌లు వుంటాయి. కానీ అసలైన క్లైమాక్స్ చివర్లోనే వస్తుంది. అప్పటివరకు ప్రేక్షకుడికి ఉత్కంఠ కొనసాగించాల్సిందే. కానీ మన రాజకీయ నాటకాల్లో అసలు క్లైమాక్స్ వస్తుందా ? అనేది ప్రశ్న. ప్రజలే ప్రేక్షకులు. ప్రతిరోజూ డైలీ సీరియల్‌లా మీడియాలో చూస్తూ అలసిపోతున్నారు.


రాజకీయ నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేస్తారు. “జైలు చిప్పకూడు తినాల్సిందే” అంటూ హెచ్చరిస్తారు. కానీ ఆ మాటల దాకా మాత్రమే. అసలు చర్యలు ఉండవు. దమ్ముంటే అరెస్ట్ చేయండి అంటూ సవాళ్ళు విసురుతారు. కానీ అరెస్ట్ చేసినా — బెయిల్ లభిస్తుంది. సాక్ష్యాలు ఉన్నా… శిక్ష పడదు. ఇదే విధంగా కేసులు నడుస్తూనే ఉంటాయి. ప్రజలు చూస్తూనే ఉంటారు.


ఇక్కడ అసలు ప్రశ్న:
* ఈ కేసులు ఎందుకు పూర్తవ్వడం లేదు?
* సూత్రధారులు ఎవరు? వారిని ఎందుకు టచ్ చేయలేరు?
*  రాజకీయ, అధికారులు, మంత్రులు కలిసి పనిచేస్తున్న ఈ వ్యవస్థలో ఎవరు ఎవరికీ ఫుల్ స్టాప్ పెట్టగలరు?


ఒక పెద్ద క్లైమాక్స్ కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. కానీ అప్పుడు వచ్చేంత వరకూ - ఇదో రాజకీయ థ్రిల్లర్.. కానీ దానికి అసలైన ముగింపు ఎప్పటికీ ఉండకపోవచ్చనే అనుమానం. ప్రజలు ఎప్పుడో ప్రశ్నిస్తున్నారు – “ముగించలేని కేసులు మొదలెందుకు పెట్టారు?”

మరింత సమాచారం తెలుసుకోండి: