- ( గ్రేట‌ర్ హైద‌రాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . . .

భారత రాష్ట్ర సమితి చీఫ్ కేసీఆర్ ఇటీవల తన ఫామ్ హౌస్‌లో చండీ గణపతి హోమాన్ని నిర్వహించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన ఈ హోమానికి కేసీఆర్ ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. గత నెలలోనే ఈ హోమం చేయాలనుకున్నా, ఆరోగ్య సమస్యల కారణంగా ఆస్పత్రిలో చేరడంతో వాయిదా పడింది. ప్రస్తుతం పార్టీ ఎదుర్కొంటున్న సంక్షోభం, రోజురోజుకూ మారుతున్న రాజకీయ పరిస్థితులు ఈ హోమానికి కారణమని బీఆర్ఎస్ వ‌ర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ హోమాన్ని ఎవరు నిర్వహించారనే అంశంపై స్పష్టత లేదు. సాధారణంగా కేసీఆర్ యాగాలు జరిగితే చినజీయర్ లేదా విశాఖ స్వరూపానంద స్వామిని పిలిచే వారు. కానీ చినజీయర్‌తో సంబంధాలు చల్లారిన తర్వాత ఎక్కువగా స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలోనే యాగాలు జరిగాయి.


అయితే ఆయనతో చేసిన యాగాలకు పెద్దగా ఫలితం రాలేదన్న అభిప్రాయం ఉంది. పైగా ఆయ‌న ఆలోచ‌న‌ల‌కు, కేసీఆర్‌కు స‌రిపోలేద‌న్న టాక్ కూడా ఉంది. కోకాపేటలో రెండు ఎకరాల భూమిని కేసీఆర్ కేవలం రెండు రూపాయలకు రాసిచ్చార‌ని... అయినా స్వ‌రూపానంద పై కేసీఆర్‌కు అంత‌గా న‌మ్మ‌కం కూడా లేద‌నే అంటున్నారు. ఈ నేపథ్యంలో తాజా చండీహోమాన్ని ఎవ‌రి ఆధ్వర్యంలో జరిపారు అన్న‌ది బయటకు రాలేదు. ఇలాంటి యాగాలు జరగడం అనేది కేసీఆర్ కుటుంబం మొత్తానికి సంప్రదాయంగా మారింది. కానీ ఈసారి కుటుంబసభ్యులందరూ ఉన్నప్పటికీ కవిత హాజరు కాకపోవడం పెద్ద లోటుగా కనిపించింది. రాజకీయ కారణాల వల్ల కవితను పూర్తిగా కుటుంబానికి దూరం పెట్టినట్లు కనిపిస్తోంది. ఇది బీఆర్ఎస్ లోపలి విభేదాలను మాత్రమే కాకుండా, కుటుంబ బంధాలను కూడా దెబ్బతీసినట్లు పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. రాజకీయ విబేధాలు ఇంత వరకు వెళ్ళిపోవడం, కేసీఆర్ కుటుంబంలోనే ఇలాంటి పరిస్థితులు రావడం బీఆర్ఎస్ భవిష్యత్తుపై మరింత అనుమానాలు రేకెత్తిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: