ద్రౌపది అనగానే.. ఈ కాలంలో ప్రతి ఒక్కరికి ఐదు భర్తలను కలిగిన ఒక సాధారణ మహిళగా మాత్రమే తెలుసు. అయితే ఓర్పులో భూదేవిని, సహనంలో సీతాదేవిని మించిపోయిన ఆమె వ్యక్తిత్వం గురించి చాలా మందికి తెలియదు. వ్యాస భారతం ప్రకారం ఆనాటి సమాజంలో ద్రౌపది ఎదుర్కొన్న కష్టాల గురించి ఆమె జీవితం గురించి చాలామందికి తెలియని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మత్స్య యంత్రాన్ని ఛేదించి, ద్రౌపదిని దక్కించుకున్న అర్జునుడు లాంఛనంగా సోదర సమేతంగా, అక్కడి నుంచి ఆమెను తీసుకొని ఏకచక్ర పురానికి వస్తాడు. అర్జునుడిని తన భర్తగా అనుకుంటూ, ఎన్నో కలలు కంటూ మెట్టినింటిలోకి అడుగుపెడుతుంది ద్రౌపది. అయితే ఇంటికి వచ్చింది ద్రౌపది అని కుంతీదేవికి ముందే తెలుసు. ఇక తెలిసే తెచ్చింది ఏదైనా ఐదుగురూ సమానంగా పంచుకోమని పాండవులకు చెబుతుంది కుంతీదేవి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, అక్కడ ఉన్న ఏ ఒక్కరూ కూడా ద్రౌపది యొక్క అభిప్రాయాన్ని అడగరు. వ్యాసుడు ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
అయితే ఇక్కడ అందరికీ తెలియని మరో విషయాన్ని కూడా వ్యాస మహర్షి ప్రస్తావించాడు. అది ఏంటంటే అర్జునుడు కార్యార్థి వెళ్లి ద్రౌపదిని పొందినా, ఆమెను మిగిలిన నలుగురు పాండవులు ఇష్టపడతారు. ఈ విషయం తెలిసిన కుంతి భయపడుతుంది. ద్రౌపది కోసం పాండవులు తమలో తాము కలహించుకుంటారేమో అని భయపడి, అందుకే కుంతీ, ద్రౌపదిని తెలిసి తెలిసి ఐదుగురు భర్తలకు భార్యను చేసింది. భారతంలో ఈ ప్రస్తావన వున్నా, ఎందుకో పండితులు ఈ విషయాన్ని బయట ఎక్కడా ప్రస్తావించరు. ద్రౌపది ఇష్టపూర్వకంగా ఐదుగురిని భర్తలుగా స్వీకరించలేదు అనేది స్పష్టం. ఇక కుంతీ దేవి నిర్ణయం మేరకు ఐదుగురికి భార్య కావాల్సి వచ్చింది అనేది వాస్తవం. ఆ పరిస్థితిలో ద్రౌపది మానసిక స్థితిని, ఆమె ఇచ్చిన ప్రమాణం ను బట్టి అసలు భర్తగా ఎవరిని చూసిందనేది స్పష్టమవుతోంది..
ఆమె ధర్మరాజుని ఎప్పుడూ రాజు లాగే చూసింది. భీముడిని ఆప్తుడిగా చూసింది. ఇక నకుల, సహదేవులను బిడ్డలుగా చూసుకుంది. కేవలం అర్జునుడిని మాత్రమే ఆరాధించింది. నిజమైన భర్తగా అర్జునుడిని మాత్రమే చూసిందని వ్యాస భారతంలో స్పష్టంగా ప్రస్తావించబడింది. ద్రౌపది జీవితమంతా ఎన్నో కష్టాలతో కలిసింది. ఇక భార్య అంటే ఎలా ఉండాలో రుక్మిణి ద్రౌపది దగ్గర నేర్చుకుంది. అంతటి పతివ్రత అయిన ద్రౌపది గురించి ఎన్నో పుస్తకాలలో వక్రీకరించి రాశారే తప్ప, ఆమె వ్యక్తిత్వాన్ని , ఆమె ఎన్నో కష్టాలు నష్టాలు కలగలిసిన సౌందర్యవతి అని ఎక్కడా వర్ణించలేదు. ద్రౌపదిని మించిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి మరొకరు లేరు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ వ్యాసం చదివిన తర్వాత అయినా ద్రౌపది గురించి మంచిగా అర్థం చేసుకుంటారని మా తపన.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి