వైసీపీలో ఎంద‌రో ఎమ్మెల్యేలు ఉన్నారు. కానీ, అంద‌రిలోనూ ఒకే ఒక్క‌రు మాత్రం ప్ర‌త్యేకంగా ఉన్నారు. ఆయ‌నే చిత్తూరు జిల్లా చంద్ర‌గిరి నియోజ‌క‌వ‌ర్గం ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి. ఏ కార్య‌క్ర‌మం చేసినా.. ఆయ‌న ప్ర‌త్యేకంగా నిల‌బ‌డ‌తారు. పార్టీలో ఆయ‌న అజాత శ‌త్రువు. ఇక‌, నియోజ‌క‌వ‌ర్గం ప్ర‌జ‌ల‌కు పిలిస్తే.. ప‌లికే నాయ‌కుడు. అలాంటి నాయ‌కుడికి.. తాజాగా ఆనందం ప‌ట్టలేనంత‌గా ప్ర‌శంస‌లు వ‌చ్చిప‌డ్డాయి. అది కూడా సీఎం జ‌గ‌న్ స‌మ‌క్షంలోనే కావ‌డంతో ఆయ‌న ఆనందం క‌ట్ట‌లు తెచ్చుకుంది. తాజాగా హైద‌రాబాద్ శివారులోని ముచ్చింత‌ల్‌లో రామానుజాచార్యులు విగ్ర‌హాన్ని ద‌ర్శించేందుకు సీఎం జ‌గ‌న్ వెళ్లారు.

ఆయ‌న వెంట చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, టీటీడీ చైర్మ‌న్ వైవీ సుబ్బారెడ్డి దంప‌తులు, డిప్యూటీ స్పీక‌ర్ కోన ర‌ఘుప‌తి ఇలా అనేక మంది వెళ్లారు. అయితే.. వీరంద‌రినీ ప‌క్క‌న పెట్టి.. చిన‌జీయ‌ర్ స్వామి.. చెవిరెడ్డిపై ప్ర‌సంశ‌ల జ‌ల్లు కురిపించారు. పేరు పెట్టి మ‌రీ.. ఆయ‌న పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. ఇక్క‌డ ప్ర‌తి దేవాల‌యానికీ.. గ‌త మూడు రోజులుగా వివిధ ర‌కాల పూల‌తో అలంక‌రించారు. అయితే.. ఈ పూల‌న్నీ.. చెవిరెడ్డి తెప్పించ‌నవేన‌ని స్వామి చెప్పారు. అంతేకాదు.. దీనికి అయ్యే సొమ్మంతా .. ఎమ్మెల్యే త‌న సొంత ఖ‌ర్చు కింద భ‌రిస్తున్నార‌ని.. ఆశ్ర‌మం ఒక్క‌రూపాయి కూడా ఇవ్వ‌లేద‌ని.. స్వామి వెల్ల‌డించారు. చెవిరెడ్డి నేల‌పైనే ప‌డుకున్నార‌ని.. క‌నీసం.. త‌ల‌గ‌డ కూడా అడ‌గ‌లేద‌ని అన్నారు.

ఈ నేప‌థ్యంలో ``ఎందుక‌య్యా ఇలా చేస్తున్నావ్‌?`` అని తాను ప్ర‌శ్నించ‌గా.. మా బాస్ చెప్పారు.. నేను చేస్తున్నాను.. అని చెవిరెడ్డి స‌మాధానం చెప్పిన‌ట్టు సీఎం స‌మ‌క్షంలోనే చిన‌జీయ‌ర్ స్వామి వెల్ల‌డించారు. స్వామి భ‌క్తి అంటే.. ఇలా ఉండాల‌ని.. దీనికి చెవిరెడ్డి తార్కాణ‌మ‌ని.. స్వామి పేర్కొన్నారు. దీంతో చెవిరెడ్డి ఆనందం అంతా ఇంతాకాదు. ప‌క్క‌నే సీఎం ఉండి చిరు న‌వ్వులు చిందించ‌డం కొస‌మెరుపు. ఇక‌, చెవిరెడ్డి ఈ ఒక్క విష‌యంలోనే కాదు.. అనేక సంద‌ర్భాల్లో సీఎం చెప్పిన మాట‌ను జ‌వ‌దాట‌లేదు. త‌న‌కు ప‌ద‌వి ఉందా లేదా? అనే విష‌యంతో సంబంధం లేకుండా.. సీఎం చెప్పారంటే.. తాను చేస్తారంతే.. అన్న‌ట్టుగా ముందుకు సాగుతున్నారు.

సీఎం తాడాప‌ల్లి ఆఫీస్‌లో గోశాల నిర్మాణం మొత్తం చెవిరెడ్డి ఆధ్వ‌ర్యంలోనే సాగింది. సంక్రాంతి వేడుక‌కు అన్నీతానై ఏర్పాట్లు చేశారు. ఇలా.. అనేక రూపాల్లో సీఎంకు అత్యంత సన్నిహిత వ్య‌క్తిగా ఉన్న ఎమ్మెల్యేను స్వామి నేరుగా కొనియాడ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్య ప‌రిచింద‌న‌డంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: